కేంద్ర బడ్జెట్ రాష్ట్రానికి నిరాశే – CPI(ML) లిబరేషన్ నాయకుడు డి. హరినాథ్ విమర్శ


ఏలూరు జిల్లా,చాట్రాయి: ఏలూరు జిల్లా స్టాండింగ్ కమిటీ సమావేశం చాట్రాయి మండలం జనార్ధనవరం గ్రామంలో జిల్లా కార్యదర్శి దుర్గం పుల్లారావు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి. హరినాథ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.


ఈ సందర్భంగా హరినాథ్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్ రాష్ట్రాన్ని తీవ్రంగా నిరాశపరిచిందని విమర్శించారు. నాలుగు రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఆయా రాష్ట్రాలకు వరాల జల్లు కురిపిస్తూ, మిగిలిన రాష్ట్రాలకు మాత్రం మొండి చేయి చూపిందని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు ఢిల్లీ చుట్టూ ఎన్ని ప్రదక్షిణలు చేసినా, రాష్ట్రానికి కేటాయింపుల రూపంలో దక్కింది శూన్యమేనని ఆయన అన్నారు.

మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఫిబ్రవరి 12వ తేదీన దేశవ్యాప్తంగా జరగనున్న సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని సమావేశం నిర్ణయించింది. ఈ సమ్మెపై గ్రామగ్రామాన అవగాహన కల్పించేందుకు ఫిబ్రవరి 8వ తేదీన మోటార్ సైకిల్ ర్యాలీల ద్వారా ప్రచారం నిర్వహించాలని నిర్ణయించారు.

అలాగే CPI(ML) లిబరేషన్ ఆధ్వర్యంలో ప్రజలు ఎదుర్కొంటున్న తక్షణ సమస్యలపై ఫిబ్రవరి 16న చాట్రాయి మండల కేంద్రంలో, ఫిబ్రవరి 19న ముసునూరు మండల కేంద్రంలో ధర్నాలు నిర్వహించాలని నిర్ణయించారు. మార్చి 2వ తేదీన ఏలూరు కలెక్టర్ కార్యాలయం ఎదుట భారీ ధర్నా చేపట్టాలని కమిటీ నిర్ణయించింది.

ఈ సమావేశంలో పలు డిమాండ్లను రూపొందించి వాటిని విస్తృతంగా గ్రామాల్లో ప్రచారం చేయాలని తీర్మానించారు. చింతలపూడి ఫేజ్–2 ఎత్తిపోతల పథకాన్ని తక్షణమే పూర్తి చేయాలని, ఇల్లు లేని వారందరికీ ఇళ్లు లేదా ఇళ్ల స్థలాలు కేటాయించాలని, అటవీ భూముల ఫారెస్ట్ నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి గ్రామంలో స్మశాన భూమి మంజూరు చేయాలని, జాతీయ ఉపాధి హామీ పథకాన్ని 200 రోజులకు పెంచి రోజుకు 600 రూపాయల వేతనం చెల్లించాలని, మహాత్మా గాంధీ పేరును కొనసాగించాలని, నాలుగు లేబర్ కోడ్స్‌ను రద్దు చేయాలని తీర్మానించారు.

ఈ సమావేశంలో చాట్ల బాబురావు, వేముల బక్కయ్య, కలపాల వెంకటేశ్వరరావు, దుర్గం పూజిత, తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు.