ప్రజారోగ్యానికి కూటమి ప్రభుత్వ పెద్దపీట – సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే బడేటి చంటి


ఏలూరు, ఫిబ్రవరి 04 : ప్రజారోగ్య సంరక్షణకు కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న అవసరార్థులకు తక్షణ సహాయం అందించడంలో ప్రభుత్వం సమర్థవంతంగా స్పందిస్తోందని ఆయన స్పష్టం చేశారు.


బుధవారం ఏలూరు పవర్‌పేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో అనారోగ్యంతో బాధపడుతున్న 32 మంది బాధితులకు మంజూరైన రూ.19,84,056 విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు, అలాగే రూ.2,87,336 విలువైన రెండు ఎల్‌వోసీ కాపీలను ఎమ్మెల్యే బడేటి చంటి, ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు పంపిణీ చేశారు. బాధితులకు భరోసా కల్పించారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే బడేటి చంటి, అనారోగ్యంతో బాధపడుతున్న ప్రజలకు తక్షణ సాయం అందించాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనల మేరకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని తెలిపారు. సంక్షేమం, అభివృద్ధితో పాటు ప్రజల ఆరోగ్య సంరక్షణను కూడా ప్రభుత్వం అత్యంత బాధ్యతగా ముందుకు తీసుకెళ్తోందన్నారు.

ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ విధానాల వల్ల ప్రజల జీవన ప్రమాణాలు మరింత మెరుగుపడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని, అదే దిశగా ప్రజాప్రతినిధులుగా తాము బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నామని ఎమ్మెల్యే చంటి వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో ఈడా చైర్మన్ పెద్దిబోయిన శివప్రసాద్, డిప్యూటీ మేయర్ కర్రి శ్రీనివాస్, టిడిపి నగర అధ్యక్షులు చోడే వెంకటరత్నం, కార్యదర్శి రెడ్డి నాగరాజు, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, క్లస్టర్ ఇంచార్జీలు, డివిజన్ ఇంచార్జీలు తదితరులు పాల్గొన్నారు.