ముందస్తు అడ్మిషన్లు–అధిక ఫీజుల వసూళ్లపై చర్యలు తీసుకోవాలి : ఏఐఎస్ఎఫ్ డిమాండ్


ఏలూరు: విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలు పూర్తికాకముందే ఏలూరు జిల్లాలోని కొన్ని ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు ముందస్తు అడ్మిషన్లు చేపడుతూ, తల్లిదండ్రులను మాయమాటలతో మభ్యపెడుతున్నాయని ఏఐఎస్ఎఫ్ ఏలూరు జిల్లా అధ్యక్షులు డి. శివ ఆరోపించారు.


“మీ పిల్లలకు ఫీజులు తగ్గిస్తాం, మంచి భవిష్యత్తు కల్పిస్తాం” అంటూ తల్లిదండ్రులను ఆకర్షించి ముందస్తు అడ్మిషన్లు చేయించుకొని, అనంతరం అధిక ఫీజులు వసూలు చేయడానికి విద్యాసంస్థలు సిద్ధమవుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

అంతేకాకుండా జిల్లాలో కొన్ని విద్యాసంస్థలకు ప్రభుత్వ గుర్తింపు కూడా లేకపోయినా, నిర్భయంగా అడ్మిషన్లు నిర్వహిస్తున్నాయని, ఇలాంటి వాటిపై జిల్లా విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోకపోవడం అత్యంత బాధాకరమన్నారు. ప్రభుత్వ గుర్తింపు లేని విద్యాసంస్థలను వెంటనే సీజ్ చేయాలని డిమాండ్ చేశారు.

విద్యాసంస్థల ఫీజుల వసూళ్లపై జిల్లా విద్యాశాఖ అధికారులకు అనేకసార్లు వినతిపత్రాలు అందించినప్పటికీ, ఎలాంటి స్పందన లేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఏఐఎస్ఎఫ్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇప్పటికైనా జిల్లా విద్యాశాఖ అధికారులు అప్రమత్తమై జిల్లాలో జరుగుతున్న అధిక ఫీజుల వసూళ్లపై దృష్టి సారించి, నిబంధనలు ఉల్లంఘిస్తున్న విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో విద్యార్థులు, తల్లిదండ్రులను కలుపుకొని పెద్ద ఎత్తున పోరాటాలకు పిలుపునిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు సిద్ధు, కృష్ణ, చంటి తదితరులు పాల్గొన్నారు.