దక్షిణ కాశీ బలివేలో మహాశివరాత్రి ఏర్పాట్లు పటిష్టంగా చేపట్టాలి – అధికారులకు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆదేశాలు


ఏలూరు జిల్లా, దెందులూరు, ఫిబ్రవరి 08: దక్షిణ కాశీగా పేరుగాంచిన బలివే పుణ్యక్షేత్రంలో రానున్న మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖల పూర్తి సమన్వయంతో ఏర్పాట్లు మరింత పటిష్టంగా నిర్వహించాలని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అధికారులను ఆదేశించారు.


పెదవేగి మండలం నడిపల్లి గ్రామపంచాయతీ పరిధిలో రూ.70 లక్షల ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో బీసీ రోడ్ నుంచి తమ్మిలేరు బ్రిడ్జి వరకు నిర్మించిన నూతన బీటీ రోడ్డును ప్రారంభించిన అనంతరం, బలివే బ్రిడ్జి వద్ద మహాశివరాత్రి ఏర్పాట్లపై రెవెన్యూ, పోలీస్ సహా పలు శాఖల అధికారులతో కలిసి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మహాశివరాత్రి సందర్భంగా బలివే క్షేత్రానికి కృష్ణా జిల్లా, తెలంగాణ రాష్ట్రం, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా సహా పలు ప్రాంతాల నుంచి లక్షలాదిమంది భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోందని తెలిపారు. ఈ నేపథ్యంలో భక్తుల భద్రత, సౌకర్యాలే లక్ష్యంగా ప్రతి అంశంపై ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.

రహదారికి సమీపంలోనే ద్విచక్ర వాహనాలు, ఇతర వాహనాల కోసం ప్రత్యేక పార్కింగ్ ఏర్పాట్లు చేయాలని, భక్తులకు త్రాగునీరు అందుబాటులో ఉంచడంతో పాటు పారిశుద్ధ్య నిర్వహణ, జనసమ్మర్ధం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో రద్దీ నియంత్రణ, వైద్య శిబిరాల ఏర్పాటు వంటి అంశాలను సమర్ధవంతంగా అమలు చేయాలని ఆదేశించారు.

గత ఏడాది మహాశివరాత్రి ఉత్సవాల సమయంలో తమ్మిలేరు వద్ద ఇద్దరు వ్యక్తులు దురదృష్టవశాత్తు మృత్యువాత పడిన ఘటనను దృష్టిలో ఉంచుకుని, ఈ ఏడాది మరింత కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ఈ మేరకు అవసరమైన అదనపు పోలీస్ సిబ్బందిని ముందుగానే నియమించేందుకు చర్యలు చేపట్టాలని కోరుతూ ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ గారిని ఫోన్ ద్వారా సంప్రదించినట్లు తెలిపారు.

మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా బలివే క్షేత్రానికి వచ్చే భక్తులకు చింతమనేని చారిటబుల్ ట్రస్ట్‌తో పాటు స్థానిక కూటమి నాయకులు, కార్యకర్తలు సేవలు అందిస్తారని తెలిపారు. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ యంత్రాంగం, అధికారులు, సిబ్బంది, కూటమి నాయకులు, కార్యకర్తలు, భక్తులు అందరూ సమష్టిగా సహకరిస్తేనే శివరాత్రి ఉత్సవాలు ఘనంగా, విజయవంతంగా నిర్వహించవచ్చని ఆయన పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఏలూరు రెవెన్యూ డివిజనల్ అధికారి అచ్యుత అంబరీష్, పెదవేగి సర్కిల్ ఇన్స్పెక్టర్ చిన్నం రాజశేఖర్, దెందులూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ గారపాటి రామసీత, బీజేపీ జిల్లా అధ్యక్షులు చౌటుపల్లి విక్రమ్ కిషోర్, తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు, విజయరాయి సొసైటీ చైర్మన్ బొప్పన సుధా, జిల్లా పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఉప్పలపాటి రాంప్రసాద్, పెదవేగి సొసైటీ చైర్మన్ తాత సత్యనారాయణ, మండల పార్టీ అధ్యక్షులు ఈడ్పుగంటి అనిల్, నంబూరు నాగరాజు, మరడాని రవి తదితర ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.