ఏలూరు జిల్లా, దెందులూరు, ఫిబ్రవరి 04: వైసీపీ మాజీ ఎమ్మెల్యే కొటారు అబ్బాయి చౌదరి ఇటీవల చేసిన వ్యాఖ్యలను దెందులూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు. పెదవేగి మండలం దుగ్గిరాల్లో నిర్వహించిన సమావేశంలో టీడీపీ సీనియర్ నాయకులు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం, కూటమి నాయకత్వంపై అబ్బాయి చౌదరి చేస్తున్న వ్యాఖ్యలు అసత్యాలతో నిండినవని, ఇవి ఆయన రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనమని ఆరోపించారు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో అబ్బాయి చౌదరి, ఆయన అనుచరులు చేసిన అక్రమాలు, అవినీతి చర్యలను సాక్ష్యాలతో సహా ప్రజల ముందుకు తీసుకొచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. ఈ అంశాలపై ప్రజల సమక్షంలో బహిరంగ చర్చకు రావాలని, సత్తా ఉంటే స్వీకరించాలని అబ్బాయి చౌదరికి బహిరంగ సవాల్ విసిరారు.
ఈ సందర్భంగా టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు, విజయరాయి సొసైటీ చైర్మన్ బొప్పన సుధా మాట్లాడుతూ, బలివే బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించి అబ్బాయి చౌదరి చేస్తున్న వ్యాఖ్యల్లో నిజం లేదని అన్నారు. బ్రిడ్జి నిర్మాణానికి రూపకల్పన, అంచనాలు, భూసేకరణ అన్నీ అప్పటి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ హయాంలోనే జరిగాయని తెలిపారు. ఉచిత ఇసుక విధానం అమలులో ఉన్నప్పటికీ, అక్రమ ఇసుక, గ్రావెల్ త్రవ్వకాలపై అబ్బాయి చౌదరి చేసిన వ్యాఖ్యలు వాస్తవ విరుద్ధమని ఆరోపించారు.
రాష్ట్ర యాదవ్ కార్పొరేషన్ డైరెక్టర్, బీసీ నాయకులు పెనుబోయిన మహేష్ యాదవ్ మాట్లాడుతూ, వైసీపీ హయాంలో సోషల్ మీడియా పోస్టుల పేరుతో యువకులపై వేధింపులు, బీసీ నాయకుల ఇళ్లపై దాడులు, పోలీస్ బలగాలతో భయాందోళనలు సృష్టించిన ఘటనలు ప్రజలకు బాగా తెలుసని అన్నారు. బీసీ వర్గాలపై జరిగిన దాడులు, హత్యాయత్నాలపై అబ్బాయి చౌదరి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
పెదవేగి సొసైటీ చైర్మన్ తాత సత్యనారాయణ మాట్లాడుతూ, అక్రమ గ్రావెల్ త్రవ్వకాలను అడ్డుకున్నందుకు తనపై హత్యాయత్నం జరిగిందని, ఈ ఘటనలపై బహిరంగ చర్చకు తాము సిద్ధమని తెలిపారు. గౌడ, బీసీ సామాజిక వర్గాలపై వైసీపీ హయాంలో జరిగిన వేధింపులపై అబ్బాయి చౌదరి స్పందించాలని డిమాండ్ చేశారు.
ఏలూరు రూరల్ మండలం క్లస్టర్ ఇంచార్జ్ నేతల రవి మాట్లాడుతూ, కొల్లేరు ప్రాంతంలో పేద ప్రజల నుంచి కోట్లాది రూపాయల బకాయిలు వసూలు చేసిన అంశాలపై బహిరంగంగా చర్చిద్దామని అన్నారు. కొల్లేరు ప్రజల సమక్షంలో చర్చకు రావాలని, 48 గంటల గడువు ఇస్తున్నామని సవాల్ విసిరారు.
దెందులూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ గారపాటి రామసీత మాట్లాడుతూ, ఏపూరు ప్రాంతంలో పేదల ఇళ్ల నిర్మాణాలు, భూసేకరణ పేరుతో జరిగిన అక్రమాలపై అబ్బాయి చౌదరి సమాధానం చెప్పాలని అన్నారు. టీడీపీ హయాంలో మంజూరైన బిల్లులను వైసీపీ హయాంలో నిలిపివేశారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పెండింగ్ బిల్లులు చెల్లించిందని తెలిపారు.
క్లస్టర్ వన్ ఇంచార్జ్ మంచినేని శ్రీనివాస్ మాట్లాడుతూ, వైసీపీ నాయకులు ఇతరులపై ఆరోపణలు చేస్తూ వాస్తవాలను దాచిపెడుతున్నారని విమర్శించారు. అక్రమాలకు సంబంధించిన అనేక అంశాలపై ప్రజల ముందే చర్చకు రావాలని అబ్బాయి చౌదరికి మరోసారి సవాల్ విసిరారు.
ఈ సమావేశంలో జిల్లా తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఉప్పలపాటి రాంప్రసాద్, జిల్లా కార్యదర్శి దేవరపల్లి ఆదాం, జిల్లా అధికార ప్రతినిధి గుడిపూడి రేవతి, పెదవేగి మండల పార్టీ అధ్యక్షులు ఈడుపుగంటి అనిల్, పెదపాడు మండల పార్టీ అధ్యక్షులు మరడాని రవి, ఏలూరు రూరల్ మండల పార్టీ అధ్యక్షులు నంబూరి నాగరాజు, నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు మోత్కూరి నాని, పెదపాడు మండల క్లస్టర్ ఇంచార్జ్ గుత్తా అనిల్‌తో పాటు పలువురు టీడీపీ సీనియర్ నాయకులు, సొసైటీ చైర్మన్లు పాల్గొన్నారు.















Social Plugin