ఏలూరు జిల్లా, ముసునూరు: ఏలూరు జిల్లా ముసునూరు మండలం లోపుడి గ్రామంలో సంఘ పెద్దల వ్యవహారం తీవ్ర కలకలాన్ని రేపింది. గ్రామానికి చెందిన కనకారావు అనే వ్యక్తిని అతని కుటుంబంతో సహా గ్రామం నుంచి వెలివేయడంతో, అవమానాన్ని తట్టుకోలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటామని సెల్ఫీ వీడియో తీసిన ఘటన సంచలనం సృష్టించింది.
బాధితుడు కనకారావు, తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటామని సెల్ఫీ వీడియోలో పేర్కొన్నాడు. తమకు జరిగిన అన్యాయానికి గ్రామంలోని కుల పెద్దలే కారణమని, తమ చావుకు వారే బాధ్యత వహించాలని వీడియోలో ఆరోపించాడు. సెల్ఫీ వీడియో తీసిన అనంతరం కనకారావు కుటుంబం అదృశ్యమవడంతో గ్రామంలో తీవ్ర ఆందోళన నెలకొంది.
గత కొద్ది రోజుల క్రితం నాటుసారా కేసులో కనకారావు అరెస్టు అయ్యాడని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో గ్రామంలోని గౌడ కులానికి చెందిన కుల పెద్దలు పంచాయతీ ఏర్పాటు చేసి, కనకారావును మోకాళ్ల దండపై నిలబెట్టి అవమానించినట్టు బాధితుడు ఆరోపించాడు. నాటుసారా తయారు చేశాడన్న కారణంతో లక్ష రూపాయల అపరాధ రుసుము విధించారని పేర్కొన్నాడు.
గ్రామ పెద్దలు అడిగినంత మొత్తం చెల్లించే స్థోమత లేకపోవడంతోనే తన కుటుంబాన్ని గ్రామం నుంచి వెలివేశారని కనకారావు ఆరోపణ. ఈ సంఘటన తన కుటుంబాన్ని మానసికంగా తీవ్రంగా దెబ్బతీసిందని వీడియోలో వేదన వ్యక్తం చేశాడు.
సెల్ఫీ వీడియో వెలుగులోకి రావడంతో అప్రమత్తమైన పోలీసు అధికారులు కనకారావు కుటుంబ సభ్యుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఘటనపై విచారణ ప్రారంభించిన పోలీసులు, గ్రామ పెద్దల పాత్రపై కూడా దృష్టి సారించినట్టు సమాచారం. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.















Social Plugin