రాష్ట్రంలో దాడుల రాజకీయాలు ప్రజాస్వామ్యానికి ముప్పు – మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు


ఏలూరు జిల్లా,బుట్టాయగూడెం: నిన్నటి నుంచి రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు తీవ్రంగా స్పందించారు. అంబటి రాంబాబు, జోగి రమేష్‌లపై జరిగిన దాడులను ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్య దేశంలో హింసకు ఎలాంటి స్థానం లేదని స్పష్టం చేశారు.


రాజకీయ విభేదాలను దాడుల ద్వారా పరిష్కరించాలనుకోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని తెలిపారు. ఇటీవలి కాలంలో వెలుగులోకి వచ్చిన కల్తీ లడ్డు వివాదాన్ని పక్కదోవ పట్టించేందుకే రాష్ట్రంలో ఈ తరహా దాడులు జరుగుతున్నాయనే అనుమానాలు ప్రజల్లో బలంగా వ్యక్తమవుతున్నాయని అన్నారు. అసలు సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు భయభ్రాంతుల రాజకీయాలను ప్రోత్సహించడం బాధాకరమని వ్యాఖ్యానించారు.

ఎన్నో రోజులు రెడ్ బుక్ రాజ్యాంగం నడవదని, ఎల్లకాలం ఒకే ప్రభుత్వం అధికారంలో ఉండదన్న నిజాన్ని పాలకులు గుర్తుంచుకోవాలని తెలిపారు. అధికార దుర్వినియోగం, అహంకారం చివరికి ప్రజల ఆగ్రహానికి దారి తీస్తాయని హెచ్చరించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిదని మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు పేర్కొన్నారు.