అనుమానాస్పదంగా నిలిచిన యాక్టివా గుర్తింపు – యజమానికి సురక్షితంగా అప్పగించిన 3 టౌన్ పోలీసులు


ఏలూరు : ఏలూరు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఆదేశాల మేరకు జిల్లాలో చేపట్టిన ప్రత్యేక బీట్ పర్యటనలో భాగంగా, ఏలూరు 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న ఏ.ఎస్‌.ఐ బండారు ఏసు @ నాని, పోలీస్ కానిస్టేబుల్ ఎస్. మణికంఠ (4163) బీట్‌లో పర్యటిస్తూ అప్రమత్తంగా వ్యవహరించారు.


ఈ సందర్భంగా గత మూడు రోజులుగా సీ.ఎం.ఆర్ షాపింగ్ మాల్ సమీపంలో ఏపీ–39 ఈఎఫ్–1436 నెంబర్ గల హోండా యాక్టివా వాహనం అనుమానాస్పదంగా నిలిపి ఉండటాన్ని పోలీసులు గమనించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు వాహనం రిజిస్ట్రేషన్ నెంబర్ ఆధారంగా యజమాని వివరాలను సేకరించారు.

విచారణలో తాపీ మేస్త్రి కాలనీ, ఏలూరుకు చెందిన కనకం శ్రీనివాసరావు వాహన యజమాని అని గుర్తించి ఆయనను సంప్రదించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ, ఏలూరు జాతర జరుగుతున్న నేపథ్యంలో ఇంటికి బంధువులు అధికంగా రావడంతో, ఇంట్లో ఉండవలసిన యాక్టివా వాహనాన్ని బంధువుల్లో ఎవరో ఒకరు తీసుకెళ్లి ఉండవచ్చని భావిస్తున్నట్లు తెలిపారు.

అనంతరం ఏలూరు 3 టౌన్ ఇన్స్పెక్టర్ కోటేశ్వర రావు ఆదేశాల మేరకు, పోలీస్ సిబ్బంది సదరు వాహనాన్ని యజమాని కనకం శ్రీనివాసరావు కి సురక్షితంగా అప్పగించారు. తన వాహనాన్ని గుర్తించి ఎలాంటి నష్టం కలగకుండా తిరిగి అప్పగించిన పోలీస్ అధికారులకు శ్రీనివాసరావు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.