ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన ఈడుపుగంటి సుందరయ్య: ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్


బలివే బ్రిడ్జికి ‘సుందరయ్య వారధి’గా నామకరణం చేస్తాం : ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్


ఏలూరు జిల్లా, ఏలూరు/దెందులూరు, ఫిబ్రవరి 08: “ఈడుపుగంటి సుందరయ్య ప్రజల గుండెల్లో చిరస్మరణీయులు. వారితో మూడు దశాబ్దాలకు పైగా నాకు ఉన్న అనుబంధం మరువలేనిది. ఆయన పేరు తరతరాల పాటు నిలిచేలా బలివే బ్రిడ్జికి ‘సుందరయ్య వారధి’గా నామకరణం చేస్తాం. సుందరయ్య విగ్రహం ఆవిష్కరించడం, ఆయన పేరుతో సుందరయ్య ఘాట్‌ను ప్రారంభించడం నాకు ఎంతో గర్వకారణం” అని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వెల్లడించారు.

పెదవేగి మండలం నడిపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని బలివే బ్రిడ్జి వద్ద విజయరాయి గ్రామ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, స్వర్గీయ ఈడుపుగంటి నాగభూషణం (సుందరయ్య) విగ్రహావిష్కరణ కార్యక్రమం ఆదివారం ఉదయం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సుందరయ్య విగ్రహాన్ని ఆవిష్కరించి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. “జోహార్ ఈడుపుగంటి సుందరయ్య” అంటూ ఆయనను స్మరించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, కమ్యూనిస్టు ఉద్యమ నేత పుచ్చలపల్లి సుందరయ్య స్ఫూర్తితో ఈడుపుగంటి నాగభూషణం కి ‘సుందరయ్య’ అనే పేరు నామకరణం చేయడం జరిగిందని, ఆ పేరుకు తగినట్లే ఈడుపుగంటి సుందరయ్య ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయే జీవితం గడిపారని అన్నారు.


తెలుగుదేశం పార్టీ నాయకుడిగా, విజయరాయి గ్రామ ఉపసర్పంచ్‌గా, విజయరాయి సొసైటీ చైర్మన్‌గా ఆయన నిర్వర్తించిన ప్రతి బాధ్యతను నీతి, నిబద్ధతతో నిర్వహించి, ఆ పదవులకు మరింత గౌరవం తెచ్చిన వ్యక్తి ఈడుపుగంటి సుందరయ్య ని ఎమ్మెల్యే కొనియాడారు. రాజకీయంగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా తనకు అత్యంత సన్నిహితుడైన సుందరయ్య తో మూడు దశాబ్దాలకు పైగా ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

ప్రజల ఆకాంక్ష మేరకు త్వరలోనే బలివే బ్రిడ్జికి ‘సుందరయ్య వారధి’గా నామకరణం చేసేలా అవసరమైన చర్యలు తీసుకుంటామని, అలాగే ఆయన పేరు చిరస్థాయిగా నిలిచేలా మరిన్ని కార్యక్రమాలు చేపడతామని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో సుందరయ్య సతీమణి ఈడుపుగంటి లక్ష్మీ సుందరయ్య, ఆయన కుమారుడు టీడీపీ నాయకులు ఈడుపుగంటి గిరిబాబు, దెందులూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ గారపాటి రామసీత, బీజేపీ జిల్లా అధ్యక్షులు చౌటుపల్లి విక్రమ్ కిషోర్, తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు, విజయరాయి సొసైటీ చైర్మన్ బొప్పన సుధా, జిల్లా పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఉప్పలపాటి రాంప్రసాద్, పెదవేగి సొసైటీ చైర్మన్ తాత సత్యనారాయణ, మండల పార్టీ అధ్యక్షులు ఈడుపుగంటి అనిల్, నంబూరు నాగరాజు, మరడాని రవి తదితర ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని సుందరయ్య కి ఘన నివాళులు అర్పించారు.