ఏలూరు జిల్లా,టి.నరసాపురం: టి. నర్సాపురం మండలం మక్కినవారిగూడెం నుంచి జీలుగుమిల్లి వరకు పంచాయతీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో సుమారు రూ.3 కోట్ల అంచనా వ్యయంతో నూతనంగా నిర్మించనున్న రహదారి పనులకు సోమవారం పోలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేసి అధికారికంగా పనులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిర్రి బాలరాజు మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధిలో రహదారులు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. మక్కినవారిగూడెం సహా పరిసర గ్రామాల ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఈ రహదారి సమస్యతో ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో, కూటమి ప్రభుత్వం హయాంలో ఈ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయించామని తెలిపారు.
ఈ రహదారి పూర్తయిన అనంతరం మక్కినవారిగూడెం నుంచి జీలుగుమిల్లి వరకు ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుందని, విద్యార్థులు, రైతులు, ఉద్యోగులు, వ్యాపారులు సహా అన్ని వర్గాల ప్రజలకు ఇది ఎంతో ఉపయోగకరంగా మారుతుందని ఎమ్మెల్యే అన్నారు. వ్యవసాయ ఉత్పత్తులు త్వరగా మార్కెట్లకు చేరుకునే అవకాశం ఏర్పడి, రైతులకు ఆర్థికంగా మేలు జరుగుతుందని పేర్కొన్నారు.
గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధి కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, రహదారులు, త్రాగునీరు, విద్యుత్, ఆరోగ్యం వంటి రంగాల్లో నిరంతరంగా అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని ఎమ్మెల్యే తెలిపారు. ప్రతి గ్రామానికి అవసరమైన మౌలిక సదుపాయాలు అందేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
రహదారి నిర్మాణ పనులు నాణ్యత ప్రమాణాలతో, నిర్ణీత కాలవ్యవధిలో పూర్తి చేయాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. ప్రజల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఎలాంటి నిర్లక్ష్యం జరగకుండా పనులు చేపట్టాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జనసేన మండల అధ్యక్షుడు అడపా నాగరాజు, టీడీపీ మండల అధ్యక్షుడు నాయుడు రామకృష్ణ గౌడ్, కూటమి నాయకులు పిన్నమనేని మధు, రాఘవరాజు సురేష్, ఆలపాటి పాపారావు, సొసైటీ చైర్మన్ సత్యనారాయణ, మధు, మాలెంపాటి హరిబాబు, మాజీ జడ్పీటీసీ చలపతి రావు, జట్ల సత్యనారాయణతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

















Social Plugin