జంగారెడ్డిగూడెంలో శ్రీ నూకాలమ్మ ఆలయంలో వైభవంగా 84వ చండీ హోమం


జంగారెడ్డిగూడెం పట్టణంలోని శ్రీ శ్రీ నూకాలమ్మ అమ్మవారి దేవస్థానంలో మాఘ పౌర్ణమిని పురస్కరించుకొని 84వ చండీ హోమం ఘనంగా నిర్వహించారు. ఆలయ శాశ్వత చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ ఆధ్వర్యంలో, కమిటీ చైర్మన్ రంగల నాగేశ్వరరావు బృందం ఈ కార్యక్రమాన్ని భక్తి వైభవాలతో నిర్వహించారు.


ఈ సందర్భంగా ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త ఈమని శశి కుమార్ శర్మ మాట్లాడుతూ, మాఘ మాసంలో వచ్చే ఆదివారం విశేషమైనదని, ఈ ఏడాది మాఘమాసం ఆదివారం పౌర్ణమితో పాటు పుష్యార్కయోగం కలసి రావడం అత్యంత అరుదైన విషయమని తెలిపారు. ఇటువంటి పవిత్రమైన యోగం 60 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే వస్తుందని, ఈ రోజున అమ్మవారికి చండీ హోమం నిర్వహించడం ద్వారా విశేష సత్ఫలితాలు లభిస్తాయని పేర్కొన్నారు.


త్వరలోనే ఆలయంలో జరుగుతున్న చండీ హోమాలు వందకు చేరువ కానున్నాయని, శత చండీయాగాలు జరిగిన ప్రదేశం మహా పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతుందని ఆయన అన్నారు. ఈ పుణ్యక్షేత్రంలో అడుగుపెట్టినంత మాత్రాన జీవితంలో ఆనందం వెల్లివిరుస్తుందని తెలిపారు.

ఈ చండీ హోమానికి పెన్మత్స రాజంరాజు–నాగలక్ష్మీదేవి, కంభంపాటి హిమగిరి ప్రసాద్–పార్వతి, కే.వి. నరసింహరాజు–కోకిల, వంకాయల సూర్యనారాయణ–విజయేశ్వరి, డి. పద్మావతి దంపతులు, చిటికెన హరికృష్ణ–ఝాన్సీ దంపతులు ఉభయదారులుగా పాల్గొన్నారు.


మాఘ మాసం సోమవారం సందర్భంగా ఆలయ కళ్యాణ వేదిక వద్ద శ్రీ నర్మదా అమృత బాణలింగేశ్వర స్వామి వారికి పంచామృత అభిషేకాలను వేదోక్తంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన కార్యదర్శి చిటికెన రాంబాబు, ఉపాధ్యక్షులు చిట్లూరి సర్వేశ్వరరావు, పోలుపర్తి రాము, చిట్లూరి సుబ్బారావు, తెల్లగొర్ల సత్యనారాయణ, రొంగల సత్యనారాయణ, జివికెఎస్ రాజు, హనుమంతరావు చౌదరి తదితర పట్టణ ప్రముఖులు, మహిళా కమిటీ సభ్యులు, సేవా బృందాల సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రసాద వితరణతో కార్యక్రమాలను విజయవంతం చేశారని ఆలయ మేనేజర్ తెలిపారు.



--------------------------------------------------------------------------------------------------------------------