పాల్గొన్న జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి, ఎమ్మెల్యే రోషన్ కుమార్
ఏలూరు జిల్లా,లింగపాలెం: లింగపాలెం మండలం గణపనేనివారిగూడెంలో తహసిల్దార్ నజీముల్లాషా ఆధ్వర్యంలో పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి, నూజివీడు సబ్ కలెక్టర్ వినూత్న, చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం రైతుల భూ హక్కులకు భద్రత కల్పించే దిశగా అధునాతన ఫీచర్లతో కూడిన పట్టాదారు పాస్‌పుస్తకాలను అందిస్తున్నట్లు తెలిపారు. లింగపాలెం మండలం గణపనేనివారిగూడెం గ్రామానికి చెందిన రైతులకు మొత్తం 112 పట్టాదారు పాస్‌పుస్తకాలను పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. అలాగే రైతులకు పామాయిల్ మొక్కలను సబ్సిడీపై అందిస్తున్నామని, ఆసక్తి గల రైతులు హార్టికల్చర్ అధికారులను సంప్రదించి మొక్కలను పొందాలని సూచించారు.
అనంతరం ఎమ్మెల్యే రోషన్ కుమార్ మాట్లాడుతూ, గత ప్రభుత్వం రైతుల భూములకు సంబంధించిన పట్టాదారు పాస్‌పుస్తకాలపై మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి ఫోటోలను ముద్రించి ఇచ్చిందని, అవి ప్రస్తుతం ఎలాంటి ఉపయోగం లేకుండా పోయాయని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రీ-సర్వే చేపట్టి, ప్రతి రైతుకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్‌పుస్తకాలను అందిస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు, ఫ్యాక్స్ చైర్మన్, గ్రామ పార్టీ అధ్యక్షులు, కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.















Social Plugin