బాల్య వివాహ ముక్త భారత్ కార్యక్రమంలో భాగంగా అవగాహన కార్యక్రమాలు


ఏలూరు, ఫిబ్రవరి, 3:  జిల్లాలో బాల్య వివాహాలు నివారించడానికి విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం.జె. అభిషేక్ గౌడ చెప్పారు. బాల్య వివాహ ముక్త భారత్ కార్యక్రమంలో భాగంగా స్థానిక కలెక్టర్ లో మంగళవారం  మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, జిల్లా బాలల సంరక్షణ యూనిట్ వారి సమన్వయంతో క్రాఫ్ (చైల్డ్ రైట్స్ అడ్వకసీ ఫౌండేషన్) వారు రూపొందించిన బాల్య వివాహ విముక్తి రథాన్ని జేసీ జండా ఊపి ప్రారంభించారు. 


ఈ సందర్భంగా జేసీ అభిషేక్ గౌడ మాట్లాడుతూ బాల్య వివాహాల కారణంగా ఆరోగ్య దుష్ప్రభావాలను ప్రజలకు తెలియజేసి జిల్లాలో ఎక్కడా బాల్య వివాహాలు జరగకుండా చూడాలన్నారు.  ఈ విముక్తి రథం జిల్లాలోని అన్ని మండలాలలో ప్రజలకు బాల్యవివాహానికి వ్యతిరేకంగా ప్రచారం కల్పించడంలో ఉపయోగపడుతుందన్నారు. జిల్లాలో ఎక్కడైనా బాల్య వివాహాలు జరుగుతున్నట్లు ప్రజలు గుర్తిస్తే 1098 మరియు 112 టోల్ ఫ్రీ నంబర్లకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని, ఫిర్యాదు చేసిన వారి పేరు గోప్యంగా ఉంచడం జరుగుతుందన్నారు.

క్రాఫ్ సంస్థ ప్రతినిధి డాక్టర్ బి ఫ్రాన్స్ తంబి మాట్లాడుతూ బాల్య వివాహ విముక్తి రథం ఏలూరు జిల్లాలోని అన్ని మండలాల్లో రోజుకి ఒక మండలం చొప్పున ప్రచారం నిర్వహిస్తుందని, ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఉచిత సహాయ నెంబర్లు గురించి మరియు బాల్యవివాహాన్ని చేస్తే వచ్చే నష్టాలు గురించి విస్తృతంగా ప్రతి మండలంలో ప్రచారం నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన వివిధ ప్రభుత్వ శాఖ అధికారులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేశారు.

ఈ సందర్భంగా బాల్య వివాహాలకి వ్యతిరేకంగా జేసి ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ సాధికారత అధికారి శ్రీమతి శారద, నోడల్ ఆఫీసర్ తులసి, జిల్లా బాలల సంరక్షణ అధికారి సిహెచ్ సూర్యచక్రవేణి, వన్ స్టాప్ సెంటర్ అడ్మినిస్టర్  సిహెచ్ నిర్మల, డిసిపియు సిబ్బంది జాహ్నవి, రాజేష్, మాధవి, చైల్డ్ రైట్స్ అడ్వకేసి ఫౌండేషన్ ట్రస్ట్  జిల్లా కోఆర్డినేటర్లు వినోద్, విద్యా శాఖ అధికారులు సొంగ నాగేశ్వరరావు, జిసిడిఓ  మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు, జిల్లా బాలల పరిరక్షణ విభాగం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.