ఏలూరు జిల్లా,భీమడోలు/ద్వారకా తిరుమల: ద్వారక తిరుమల మండలం ఎన్‌హెచ్–16 కప్పులగుంట గ్రామంలో రహదారి ప్రమాదాల నివారణే లక్ష్యంగా భీమడోలు ఇన్స్పెక్టర్ యు.జే.విల్సన్ ఆధ్వర్యంలో భారీ రహదారి భద్రత అవగాహన కార్యక్రమం మరియు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ద్వారక తిరుమల ఎస్ఐ సుధీర్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
ఏలూరు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఏలూరు డిఎస్పి డి. శ్రావణ్ కుమార్ ఆదేశాల మేరకు, ఈ రోజు (04-02-2026) రహదారి ప్రమాదాల సంఖ్యను తగ్గించేందుకు ఈ ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
ఈ సందర్భంగా హెల్మెట్ ధరించని ద్విచక్ర వాహనదారులకు జరిమానాలు విధించకుండా, వారి భద్రత దృష్ట్యా వాహనదారులతో 30 హెల్మెట్లు కొనుగోలు చేయించారు. అలాగే సరైన పత్రాలు లేని వాహనదారులకు రహదారి భద్రతపై అవగాహన కల్పించారు.
తనిఖీల సందర్భంగా భీమడోలు ఇన్స్పెక్టర్ యు.జే. విల్సన్ మాట్లాడుతూ, రహదారి ప్రమాదాల్లో మరణిస్తున్న వారిలో అత్యధికులు యువతే కావడం ఆందోళనకరమని అన్నారు. అతివేగం, నిర్లక్ష్యం, థ్రిల్ కోసం బైక్‌లను అతి వేగంగా నడపడం వల్ల తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలు కూడా ప్రమాదంలో పడుతున్నాయని హెచ్చరించారు.
ప్రమాదం జరిగినప్పుడు తలకు తగిలే చిన్న గాయం కూడా ప్రాణాంతకం కావచ్చని, హెల్మెట్ ధరించడం ద్వారా మరణాల సంఖ్యను గణనీయంగా తగ్గించవచ్చని స్పష్టం చేశారు. కేవలం జరిమానాలకే పరిమితం కాకుండా, ప్రమాదాల వల్ల కుటుంబాలు ఎదుర్కొనే వేదనను వివరించి వాహనదారులకు పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు.
ఈ సందర్భంగా పోలీసులు యువతకు పలు సూచనలు చేశారు. ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు తప్పనిసరిగా నాణ్యమైన హెల్మెట్ ధరించాలని, మైనర్లకు వాహనాలు ఇవ్వవద్దని సూచించారు. మైనర్లకు ద్విచక్ర వాహనాలు ఇస్తే తల్లిదండ్రులపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
మీ ప్రయాణం సురక్షితంగా ఉండాలంటే ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటించాలని, మీ కుటుంబం మీకోసం ఎదురు చూస్తోందని గుర్తుంచుకోవాలని చెప్పారు. రహదారి భద్రత కోసం పోలీసులు తీసుకుంటున్న చర్యలకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.















Social Plugin