అంబటి రాంబాబు వ్యాఖ్యలకు నిరసనగా జీలుగుమిల్లిలో దిష్టిబొమ్మ దగ్ధం


జీలుగుమిల్లి: మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు ఇటీవల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పై చేసిన తప్పుడు, అవాస్తవ మరియు బాధ్యతారాహిత్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ కూటమి నాయకుల ఆధ్వర్యంలో జీలుగుమిల్లి ప్రధాన కూడలిలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు దిష్టిబొమ్మను దగ్ధం చేస్తూ తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

ఈ నిరసన కార్యక్రమంలో పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు పాల్గొని మాట్లాడుతూ, రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే ఉద్దేశంతోనే వైసీపీ నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిపై అసత్య ప్రచారాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ప్రజలకు ఏమీ చేయలేని వైసీపీ నేతలు, అధికారంలో లేని నిరాశతో అబద్ధాలనే ఆయుధంగా మారుస్తున్నారని అన్నారు.

చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి రాష్ట్ర పునర్నిర్మాణం, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో నిబద్ధతతో పనిచేస్తున్నారని చిర్రి బాలరాజు పేర్కొన్నారు. అలాంటి నాయకుడిపై వ్యక్తిగత దూషణలు చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని, రాజకీయ హద్దులు దాటి చేసిన వ్యాఖ్యలను కూటమి శ్రేణులు ఏమాత్రం సహించబోమని స్పష్టం చేశారు.

వైసీపీ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో వెనుకబడి నష్టపోయిందని, ప్రజల నమ్మకాన్ని కోల్పోయిన నాయకులు ఇప్పుడు చౌకబారు విమర్శలతో రాజకీయ ఉనికిని నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. అంబటి రాంబాబు వంటి నేతలు ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

ఇలాంటి తప్పుడు వ్యాఖ్యలు కొనసాగితే రాష్ట్రవ్యాప్తంగా కూటమి నాయకులు, కార్యకర్తలు మరింత ఉద్ధృతంగా ఉద్యమాలు చేపడతారని హెచ్చరించారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండి అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో జనసేన మండల ప్రెసిడెంట్ పసుపులేటి రాము, తెలుగుదేశం పార్టీ మండల ప్రెసిడెంట్ సంకవల్లి సాయి, బీజేపీ మండల ప్రెసిడెంట్ గుడ్ల రాంబాబు, తాటియకులగూడెం సర్పంచ్ వనమా రాంబాబు, గ్రామ జనసేన ప్రెసిడెంట్ రాయి సుబ్బారావు, గంధం వెంకటేశ్వరరావు, ఎంపీటీసీ నాలి శ్రీనివాస్, గూడెల్లి లక్ష్మీనారాయణ, కోల మధు, చిర్రి శ్రీనివాస్, తోట బాలు, నారగాని నరేంద్ర, చామన శేఖర్, బొల్లగాని అఖిల్, కక్కిరాల రాము, పసుపులేటి ప్రసాద్, ఉండవల్లి కిరణ్ తదితర కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.