ఏలూరు/ఢిల్లీ, ఫిబ్రవరి 01: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026–27 కేంద్ర బడ్జెట్ అత్యుత్తమంగా ఉందని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ అన్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన అనంతరం ఆయన మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. మౌలిక సదుపాయాలు, గ్రామీణ అభివృద్ధి, విద్యారంగాలకు స్పష్టమైన నిధుల కేటాయింపులు చేయడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి పలు కీలక ప్రకటనలు చేసిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఎంపీ ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా రాజధాని అమరావతి అభివృద్ధికి బడ్జెట్‌లో రూ.1,128.91 కోట్లు కేటాయించడం సంతోషకరమని అన్నారు. అలాగే అమరావతి ఇంటిగ్రేటెడ్ అర్బన్ డెవలప్‌మెంట్ (IBRD) నిధుల ద్వారా రూ.432.09 కోట్లు, ఏపీ పట్టణ ప్రాంతాల అభివృద్ధికి రూ.800 కోట్లు కేటాయించడాన్ని ఆయన స్వాగతించారు.
గ్రామీణ రోడ్ల ప్రాజెక్టులకు రూ.500.99 కోట్లు, రహదారులు–వంతెనల పునర్నిర్మాణ పనులకు రూ.350 కోట్లు, ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహించేందుకు రూ.155.32 కోట్లు కేటాయించడంపై ఎంపీ సంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే ఏపీలోని ప్రముఖ ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలకు పరిశోధనా గ్రాంట్లను ప్రకటించడాన్ని ఆయన ఆహ్వానించారు.
అరకు, పులికాట్ ప్రాంతాల్లో ఎకో టూరిజాన్ని అభివృద్ధి చేయనున్నట్లు కేంద్రం ప్రకటించడం వల్ల ఆయా ప్రాంతాల్లోనే యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఎంపీ పేర్కొన్నారు. పర్యాటక గైడ్‌లకు స్కిల్ ట్రైనింగ్ ఇవ్వడం ద్వారా హోమ్‌స్టేలు, గైడింగ్, ట్రాన్స్‌పోర్ట్ రంగాల్లో ఉద్యోగాలు పెరుగుతాయని, పర్యాటకుల సంఖ్య పెరగడంతో గిరిజన ఉత్పత్తులకు మంచి మార్కెట్ ఏర్పడుతుందని తెలిపారు.
ఖనిజ వనరులు ఉన్న రాష్ట్రాలకు ప్రత్యేక ప్రోత్సాహం అందించనున్నట్లు కేంద్రం ప్రకటించడాన్ని ఎంపీ స్వాగతించారు. రేర్ ఎర్త్ మినరల్స్ కోసం ప్రత్యేక కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌ను చేర్చడం వల్ల రాష్ట్రంలో ఖనిజ ఆధారిత పరిశ్రమలకు బలమవుతుందని చెప్పారు. అలాగే హైస్పీడ్ రైల్ కారిడార్ల వల్ల ఆంధ్రప్రదేశ్‌కు గణనీయమైన లాభం చేకూరుతుందని అభిప్రాయపడ్డారు.
కోకో, జీడిపప్పు, కొబ్బరి సాగును ప్రోత్సహించే విధంగా ప్రత్యేక పథకాన్ని కేంద్రం తీసుకురావడం పట్ల ఎంపీ హర్షం వ్యక్తం చేశారు. ఈ పంటలు ఎక్కువగా పండించే ఏలూరు జిల్లా రైతాంగానికి ఈ నిర్ణయం ఎంతో ప్రయోజనకరంగా మారుతుందని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ విశ్వాసం వ్యక్తం చేశారు.















Social Plugin