డిజిటల్ యూనివర్సిటీ ద్వారా ప్రపంచ స్థాయి నాణ్యమైన విద్య – ఎంపీ పుట్టా మహేష్ కుమార్


ఏలూరు/ఢిల్లీ, ఫిబ్రవరి 02: ప్రపంచ స్థాయి నాణ్యమైన విద్యను ప్రతి విద్యార్థి ఇంటి వద్దకే అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం డిజిటల్ యూనివర్సిటీని ఏర్పాటు చేసినట్లు కేంద్ర విద్యా శాఖ సహాయ మంత్రి సుకాంత మజుందార్ తెలిపారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ అడిగిన ప్రశ్నకు సోమవారం లోక్‌సభలో ఆయన ఈ వివరాలు వెల్లడించారు.


ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (NIELIT) అక్టోబర్ 2025లో “NIELIT డిజిటల్ యూనివర్సిటీ (NDU) ప్లాట్‌ఫామ్”ను ప్రారంభించినట్లు తెలిపారు. ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి ఆధునిక సాంకేతిక రంగాల్లో ఆన్‌లైన్ మరియు మిశ్రమ విధాన కోర్సులు అందిస్తున్నట్లు చెప్పారు.

సెమీకండక్టర్ డిజైన్, సైబర్ ఫోరెన్సిక్స్, ఇండస్ట్రీ 4.0 వంటి రంగాల్లో రియల్ టైమ్ అనుభవం కోసం వర్చువల్ ల్యాబ్‌లు కూడా ఈ డిజిటల్ యూనివర్సిటీలో భాగంగా ఉన్నాయని మంత్రి వివరించారు. ఈ కోర్సులు నేషనల్ స్కిల్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్‌వర్క్‌కు అనుగుణంగా ఉండి, పూర్తయిన క్రెడిట్లు అకడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్‌కు బదిలీ అవుతాయని తెలిపారు.

ప్రస్తుతం NDU ప్లాట్‌ఫామ్‌లో 100కు పైగా కోర్సులు అందుబాటులో ఉండగా, వీటిని దేశవ్యాప్తంగా ఉన్న NIELIT 56 కేంద్రాల ద్వారా అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాల కోసం “స్వయం ప్లస్” ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించామని, ఇప్పటివరకు 89కు పైగా పరిశ్రమలతో ఒప్పందాలు కుదిరాయని, 4.84 లక్షల మంది ఈ ప్లాట్‌ఫామ్‌లో నమోదు చేసుకున్నారని కేంద్ర మంత్రి తెలిపారు.