చంద్రబాబు నాయుడుపై అంబటి రాంబాబు వ్యక్తిగత వ్యాఖ్యలు ఖండనీయం: ఎమ్మెల్యే రోషన్ కుమార్


చింతలపూడి: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పై వైసీపీ నాయకుడు అంబటి రాంబాబు వ్యక్తిగతంగా, అసభ్య పదజాలంతో చేసిన వ్యాఖ్యలను చింతలపూడి శాసనసభ్యులు సొంగా రోషన్ కుమార్ తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఆయన చింతలపూడిలోని తన కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు.


అభివృద్ధి ప్రదాతగా, దేశవ్యాప్తంగా మాత్రమే కాక ప్రపంచవ్యాప్తంగా పేరు పొందిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీర్తిని ఓర్వలేకే వైసీపీ నాయకులు ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలకు పాల్పడుతున్నారని రోషన్ కుమార్ విమర్శించారు. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో అశాంతిని రేకెత్తించడమే లక్ష్యంగా అంబటి రాంబాబు బూతు పదజాలంతో మాట్లాడడం వైసీపీ నీచ రాజకీయాలకు నిదర్శనమన్నారు.

సభ్య సమాజం తలవంచుకునేలా, నైతిక విలువలకు విరుద్ధంగా మీడియా ముందుకు వచ్చి వ్యాఖ్యానించడం వైసీపీ పార్టీ రాజకీయ పతనానికి పరాకాష్ట అని పేర్కొన్నారు. తన అవివేకాన్ని, సంస్కారలేమిని అంబటి రాంబాబు ఈ విధమైన వ్యాఖ్యల ద్వారా బహిర్గతం చేసుకుంటున్నారని ధ్వజమెత్తారు.

రాజకీయాల్లో వ్యక్తిగత దూషణలకు తావులేదని, కానీ వైసీపీ నాయకులు ఆక్రోశంతో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తించడం సరికాదన్నారు. ఇప్పటివరకు రాజకీయాల్లో ఎవరూ వాడని స్థాయిలో అసభ్య పదజాలాన్ని ప్రజల ముందుకు తీసుకువచ్చిన బాధ్యత పూర్తిగా వైసీపీదేనని ఆరోపించారు.

సమాజంలో నైతిక విలువలు దిగజారేలా ప్రవర్తించడం, అనైతిక విధానాలను సాధారణంగా మార్చడం వైసీపీ నాయకుల అలవాటుగా మారిందని విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ని లేదా ఆయన కుటుంబ సభ్యులను దూషిస్తే కూటమి శ్రేణులు ఏమాత్రం సహించబోమని స్పష్టం చేశారు.

అంబటి రాంబాబు బహిరంగంగా క్షమాభిక్ష కోరాలని, లేనిపక్షంలో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ఎమ్మెల్యే రోషన్ కుమార్ హెచ్చరించారు. ప్రజలు ఇప్పటికే తగిన గుణపాఠం చెప్పినప్పటికీ ఇలాంటి నాయకుల్లో మార్పు రాకపోవడం విచారకరమన్నారు.

అభివృద్ధికి చిరునామాగా నిలిచిన చంద్రబాబు నాయుడు ని రాజకీయంగా ఎదుర్కోలేక, ఆయన కుటుంబ సభ్యులపై దూషణలకు దిగడం వైసీపీ నాయకుల నిస్సహాయతకు నిదర్శనమని పేర్కొన్నారు. వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో ఇలాంటి రాజకీయ సంస్కృతి కొనసాగుతుండటం రాష్ట్ర సమాజానికి హానికరమని రోషన్ కుమార్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.