ఏలూరు డీసీసీబీలో గణతంత్ర దినోత్సవ వేడుకలు – UPI సౌకర్యం ప్రారంభం: అప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు


ఏలూరు జిల్లా, ఏలూరు: ఏలూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (DCCB) కార్యాలయంలో నిర్వహించిన 76వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో అప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు పాల్గొని, బ్యాంకు సిబ్బందితో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన గణతంత్ర దినోత్సవ ప్రాధాన్యతను వివరిస్తూ సిబ్బందిని ఉద్దేశించి ప్రసంగించారు.


గన్ని వీరాంజనేయులు మాట్లాడుతూ, 1935 భారత ప్రభుత్వ చట్టానికి బదులుగా 1950లో భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజే గణతంత్ర దినోత్సవమని గుర్తు చేశారు. స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు అర్పించిన మహానుభావులను ఈ సందర్భంగా స్మరించుకోవాలని పిలుపునిచ్చారు.

ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఏలూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో UPI (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్) సౌకర్యాన్ని ప్రారంభించటం గర్వకారణమని ప్రకటించారు. ఇది సహకార బ్యాంకింగ్ రంగంలో ఒక కీలకమైన ముందడుగని తెలిపారు.

బ్యాంకు ఆర్థిక స్థితిగతులపై మాట్లాడుతూ, 2025 ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో 100 కోట్లకు పైగా నష్టాల్లో ఉన్న డీసీసీబీ, తాను బాధ్యతలు స్వీకరించే నాటికి 69 కోట్ల నష్టంలో ఉందన్నారు. జూన్ నెల నుంచి ఇప్పటి వరకు ఆర్థిక లోటును 26 కోట్లకు తగ్గించగలిగామని, అంటే 7 నెలల్లో సుమారు 46 కోట్ల నష్టాన్ని తగ్గించామని వెల్లడించారు.

ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 200 కోట్ల డిపాజిట్లు సేకరించడంతో పాటు, మరో 200 కోట్ల రుణాలు మంజూరు చేయడం ద్వారా మొత్తం 400 కోట్ల వ్యాపారం పెరిగిందని తెలిపారు. బ్యాంకు మొత్తం లావాదేవీలు ప్రస్తుతం 6,750 కోట్లకు చేరుకున్నాయని చెప్పారు. ఈ విజయానికి ప్రధాన కారణం ఉద్యోగుల అంకితభావమేనని ప్రశంసించారు. మిగిలిన నష్టాన్ని కూడా ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా తగ్గించేందుకు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

UPI సౌకర్యం వల్ల రైతులు, గ్రామీణ కుటుంబాలకు ఆధునిక డిజిటల్ బ్యాంకింగ్ అందుబాటులోకి వస్తుందని గన్ని వివరించారు. వినియోగదారులు మొబైల్ ఫోన్ల ద్వారా తక్షణమే డబ్బు పంపుకోవడం, స్వీకరించడం చేయగలుగుతారని, బ్రాంచ్‌కు వెళ్లకుండానే నగదు రహిత లావాదేవీలు నిర్వహించవచ్చన్నారు. చిన్న, పెద్ద లావాదేవీలకు UPI పూర్తిగా సురక్షితమని స్పష్టం చేశారు.

ఈ సౌకర్యంతో ఏలూరు డీసీసీబీ కస్టమర్లు దేశంలోని ఏ వాణిజ్య బ్యాంకు వినియోగదారులతో సమాన స్థాయిలో నిలుస్తారని తెలిపారు. రైతులు మార్కెట్లలో విక్రయించే పంటలకు తక్షణమే ఆదాయం పొందగలుగుతారని, తద్వారా వారి ఆర్థిక నిర్వహణ మరింత మెరుగుపడుతుందని అన్నారు.

గ్రామాలు, మండలాల్లో డిజిటల్ చెల్లింపులు ప్రోత్సాహం పొందుతాయని, చిన్న వ్యాపారులు, కమిషన్ ఏజెంట్లు, స్వయం సహాయక బృందాలకు ఇది మేలు చేస్తుందని చెప్పారు. నగదు వినియోగంతో వచ్చే నష్టం, దొంగతనాల ప్రమాదం తగ్గుతుందని తెలిపారు. ఇది కేవలం బ్యాంకింగ్ సేవ కాకుండా గ్రామీణ ప్రజలకు సాధికారత కల్పించే అడుగని పేర్కొన్నారు.

భవిష్యత్తులో ఏలూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు మరిన్ని డిజిటల్ సేవలను ప్రవేశపెట్టేందుకు కట్టుబడి ఉందని గన్ని వీరాంజనేయులు తెలిపారు. బలమైన సహకార బ్యాంకులు అంటే బలమైన రైతులు, బలమైన గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అని ఆయన స్పష్టం చేశారు.