శోభనాపురం / ఆగిరిపల్లి, జనవరి 28: శ్రీశ్రీశ్రీ దుగ్గిరాల బాలరావమ్మ తల్లి మాఘ మాస పౌర్ణమి తిరుణాలు బుధవారం (28-01-2026) నుండి ఆదివారం (01-02-2026) వరకు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.
బుధవారం ఉదయం గ్రామంలోని మహాలక్ష్మి మాను వద్ద ముందుగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రుద్రభూమిలోని శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో, గంగానమ్మ తల్లికి ప్రత్యేక పూజలు జరిపి శ్రీశ్రీశ్రీ దుగ్గిరాల బాలరావమ్మ తల్లి తిరుణాలను అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా అమ్మవారిని అంగరంగ వైభవంగా అలంకరించి శోభనాపురం గ్రామంలో ఘనంగా ఊరేగింపు నిర్వహించారు.
గురువారం (29-01-2026) అమ్మవారి ఊరేగింపు వడ్లమాను, చొప్పరమెట్ల, తాడేపల్లి గ్రామాలలో భక్తుల నడుమ అత్యంత వైభవంగా సాగనుంది. శుక్రవారం (30-01-2026) ఉదయం సింగన్నగూడెం గ్రామంలో, రాత్రి నూగండపల్లి గ్రామంలో అమ్మవారి ఊరేగింపు జరుగుతుంది.
శనివారం (31-01-2026) శ్రీశ్రీ దుగ్గిరాల బాలరావమ్మ తల్లి ఆలయం వద్ద పాల పొంగళ్ళు, పసుపు–కుంకుమలతో ప్రత్యేక అర్చనలు నిర్వహిస్తారు. అనంతరం సాయంత్రం నాలుగు గంటల నుండి ఆగిరిపల్లి గ్రామంలో అమ్మవారిని అత్యంత వైభవంగా ఊరేగింపబడుతుంది.
ఆదివారం (01-02-2026) ఆగిరిపల్లి శ్రీశ్రీ దుగ్గిరాల బాలరావమ్మ తల్లి గుడి వద్ద కుంకుమార్చనలు, అన్నప్రసాద వితరణ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా భక్తులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని, తీర్థ–అన్నప్రసాదాలు స్వీకరించి అమ్మవారి దీవెనలు పొందాలని ఆలయ కమిటీ సభ్యులు కోరారు.















Social Plugin