కష్టపడే ప్రతి కార్యకర్తకు అండగా ఉంటా – చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్


ఏలూరు జిల్లా, చింతలపూడి: కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు అండగా నిలుస్తానని చింతలపూడి నియోజకవర్గం ఎమ్మెల్యే సొంగా రోషన్ స్పష్టం చేశారు. చింతలపూడి మండలం ప్రగడవరం పంచాయతీ పరిధిలోని ఫాతిమాపురంలో ‘కార్యకర్త అధినేత’ కార్యక్రమంలో భాగంగా నూతనంగా ఏర్పాటు చేసిన రేషన్ దుకాణాన్ని ఆయన ప్రారంభించారు.


ఈ సందర్భంగా ఎమ్మెల్యే సొంగా రోషన్ మాట్లాడుతూ, చింతలపూడి నియోజకవర్గ అభివృద్ధితో పాటు పార్టీ కార్యకర్తలకు ప్రాధాన్యత ఇస్తామని అన్నారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమాన్ని రెండు కళ్లుగా భావిస్తూ ముందుకు సాగుతోందని తెలిపారు. తెలుగుదేశం పార్టీకి క్రమశిక్షణ, కష్టపడి పనిచేసే కార్యకర్తలే ప్రధాన బలమని పేర్కొన్నారు.

పార్టీ బలోపేతం కోసం గ్రామీణ స్థాయి నుంచే పటిష్టమైన వ్యవస్థను నిర్మించాల్సిన అవసరం ఉందని అన్నారు. కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ప్రజల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తూ ముందుకు సాగాలని సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వం రాష్ట్రానికి అత్యవసరమని, అనుభవజ్ఞుడైన నాయకుడిగా స్పష్టమైన దృష్టితో పాలన సాగిస్తున్నారని ప్రశంసించారు.

ఆర్థిక సంక్షోభంలో ఉన్న రాష్ట్రాన్ని గాడిలో పెట్టే శక్తి చంద్రబాబుకే ఉందని, అభివృద్ధి, సంక్షేమం రెండింటినీ సమతుల్యం చేస్తూ పాలన సాగిస్తున్నారని అన్నారు. రాష్ట్రానికి చంద్రబాబు నాయకత్వం ఎంత అవసరమో ప్రజలే గుర్తిస్తున్నారని తెలిపారు. కార్యకర్తలే పార్టీకి ప్రాణమని, వారి సంక్షేమం, గౌరవం తెలుగుదేశం పార్టీకి ఎప్పుడూ ప్రథమ ప్రాధాన్యతేనని స్పష్టం చేశారు.

మహిళలు ఆర్థికంగా బలపడేందుకు ‘స్త్రీ శక్తి’ పథకాన్ని ప్రభుత్వం తీసుకువచ్చిందని, అలాగే ‘తల్లికి వందనం’ పథకం ద్వారా ఇంట్లో ఉన్న ప్రతి సభ్యుడికి నగదు సహాయం అందిస్తున్నామని తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందని అన్నారు.

చింతలపూడి ఎత్తిపోతల పథకం వచ్చే ఏడాది నాటికి పూర్తవుతుందని, పోలవరం ప్రాజెక్టును కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు వచ్చే ఏడాదిలో పూర్తి చేస్తారని తెలిపారు. గ్రామాభివృద్ధికి అందరూ సహకరించాలని, పంచాయతీ అభివృద్ధికి తీర్మానాలు ఇవ్వాలని సూచించారు. రోడ్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని చెప్పారు.

నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా నిరంతరం పనిచేస్తున్నామని, ఎంపీ పుట్టా మహేష్ యాదవ్‌తో కలిసి అభివృద్ధి కోసం సమన్వయంతో కృషి చేస్తున్నామని తెలిపారు. పామాయిల్ రైతులకు మద్దతు ధర కల్పించేందుకు ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని గుర్తు చేశారు. ఢిల్లీలో జిల్లా, నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధుల సాధనకు కృషి జరుగుతోందని అన్నారు.

కూటమి కార్యకర్తలను రెచ్చగొడితే సహించేది లేదని హెచ్చరించారు. కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేస్తే చూస్తూ ఊరుకోమని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు చింతా విష్ణు, జనసేన పార్టీ మండల అధ్యక్షులు చిదరాల మధుబాబు, గ్రీన్ అండ్ బ్యూటిషన్ డైరెక్టర్ పల్లి శ్రీను, గ్రామ కమిటీ అధ్యక్షులు తాళ్లూరి చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ కనమతరెడ్డి రాజశేఖర్ రెడ్డి, జనసేన గ్రామ కమిటీ అధ్యక్షులు కోసన చంద్రబాబు, ఎన్డీఏ కూటమి నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.