ఏపీఎస్ ఆర్టీసీ బోర్డు సమావేశం: విద్యుత్ బస్సులు, ఉద్యోగ నియామకాలు, ఆదాయ వృద్ధిపై కీలక నిర్ణయాలు


ఏపీఎస్ ఆర్టీసీ బోర్డు సమావేశం: విద్యుత్ బస్సులు, ఉద్యోగ నియామకాలు, ఆదాయ వృద్ధిపై కీలక నిర్ణయాలు

విజయవాడ, జనవరి 27:
ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం, ఆర్టీసీ సేవల విస్తరణ, ఉద్యోగుల సంక్షేమం, ఆదాయ మార్గాల పెంపు వంటి కీలక అంశాలపై విజయవాడలోని ఆర్టీసీ హౌస్ (ప్రధాన కార్యాలయం)లో మంగళవారం ఏపీఎస్ ఆర్టీసీ బోర్డు సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్, కృష్ణ జిల్లా టీడీపీ అధ్యక్షులు, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ రావు అధ్యక్షత వహించారు.

ఈ సమావేశంలో ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ ద్వారకా తిరుమల రావు (ఐపీఎస్), వైస్ చైర్మన్ మునిరత్నం, జోనల్ చైర్మన్లు రెడ్డి అప్పల నాయుడు (విజయవాడ), సురేష్ రెడ్డి (నెల్లూరు), పూల నాగరాజు (కడప)తో పాటు ఆర్టీసీ డైరెక్టర్లు జె. నివాస్ (ఐఏఎస్), మీనా ముకేష్ కుమార్ (ఐఏఎస్), జి.వి. రవివర్మ, ఎన్. సుధాకర్ రావు, లక్ష్మీ నారాయణ మిశ్రా (ఐఏఎస్), భాను ప్రతాప్ సింగ్ భదోరియా (ఐఏఎస్) తదితరులు పాల్గొన్నారు.

ఆర్టీసీని ఆర్థికంగా మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దడంతో పాటు సామాన్య ప్రయాణికులకు సౌకర్యవంతమైన సేవలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని చైర్మన్ కొనకళ్ల నారాయణ రావు తెలిపారు. గత ప్రభుత్వంలో తీసుకున్న పాలక మండలి నిర్ణయాలను సమీక్షించడంతో పాటు ప్రస్తుత ప్రభుత్వంలో చేపట్టాల్సిన భవిష్యత్ కార్యాచరణపై విస్తృతంగా చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు వెల్లడించారు. గత ఏడాది బోర్డు ఏర్పాటు అయిన తర్వాత నిర్వహించిన మూడో సమావేశం ఇదేనని తెలిపారు.

విద్యుత్ బస్సులపై కీలక చర్చ

రాష్ట్రంలో ఇకపై విద్యుత్ బస్సులే నడపాలన్న ప్రభుత్వ ఆలోచనపై సమావేశంలో చర్చ జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ విషయాన్ని ఇప్పటికే పలుమార్లు అధికారులతో స్పష్టం చేసినట్లు తెలిపారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్టీసీలో విద్యుత్ బస్సులు నడపడం సవాల్‌గా ఉందని ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారని చెప్పారు. విద్యుత్ బస్సుల నిర్వహణ బాధ్యతలు ఆర్టీసీదే కావాలని, బస్సుల్లో పనిచేసే సిబ్బంది కూడా ఆర్టీసీ ఉద్యోగులే ఉండాలని డిమాండ్ ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ అంశాలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు.

విద్యుత్ బస్సుల కోసం చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు ఆర్టీసీ భూములను వినియోగించడం, పీపీపీ విధానంలో ఆర్టీసీ స్థలాల అభివృద్ధి, బస్టాండ్ల ఆధునికీకరణ, బస్ స్టేషన్ల నిర్వహణ వంటి అంశాలపై కూడా సమావేశంలో చర్చించారు.

గత పాలక మండలి నిర్ణయాల సమీక్ష

గత వైసీపీ ప్రభుత్వంలో తీసుకున్న ఆర్టీసీ పాలక మండలి నిర్ణయాలను ప్రస్తుత బోర్డు సమీక్షించింది. ముఖ్యంగా అద్దె బస్సుల లీజు వ్యవహారంలో నిబంధనలకు విరుద్ధంగా పరిమితులను పెంచి, యజమానులకు లబ్ది చేకూరేలా నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఆర్టీసీకి నష్టం వాటిల్లిందని అభిప్రాయపడింది. సుమారు 200 మంది బస్సు యజమానులకు అన్యాయ లాభం కలిగిందని పేర్కొంటూ, వాస్తవాలను నిర్ధారించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించింది.

ఉద్యోగ నియామకాలు, సంక్షేమంపై తీర్మానాలు

ఆర్టీసీలో వివిధ విభాగాల్లో ఉన్న 9 వేలకుపైగా ఖాళీలను భర్తీ చేయాలని ప్రభుత్వానికి సిఫారసు చేయాలని బోర్డు నిర్ణయించింది. నిలిపివేసిన కారుణ్య నియామకాలను వెంటనే ప్రారంభించాలని కోరింది. ఆర్టీసీ ఉద్యోగులకు పెన్షన్ సమస్యపై కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపింది.

ఆర్టీసీకి కొత్త భవనాల నిర్మాణానికి బోర్డు ఆమోదం తెలిపింది. విజిలెన్స్ వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని, భవిష్యత్తులో కార్గో సేవలు ఆర్టీసీకి కీలకంగా మారనున్నాయని చర్చించారు.

కార్మిక సంఘాల వినతిపత్రం

ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ ప్రతినిధులు చైర్మన్, వైస్ చైర్మన్, జోనల్ చైర్మన్లను కలిసి వినతిపత్రం అందజేశారు. ఉద్యోగుల విలీనానికి ముందు అమలులో ఉన్న అపరిమిత వైద్య సదుపాయాలను కొనసాగించాలని, రిఫరల్ ఆసుపత్రుల్లో చికిత్సకు అనుమతి ఇవ్వాలని వారు కోరారు. ఎస్.ఆర్, బీ.ఎస్, ఎస్.బీ.టి బకాయిల చెల్లింపు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల భద్రత సహా మొత్తం 22 సమస్యలపై వినతిపత్రం సమర్పించారు.