ఏలూరు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ ఆదేశాల మేరకు, జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) ఎన్. సూర్య చంద్రరావు ఏలూరు కోర్టు మానిటరింగ్ సెల్ సభ్యులతో కీలక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం శుక్రవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలోని సమావేశ మందిరంలో జరిగింది.
ఈ సందర్భంగా అదనపు ఎస్పీ కోర్టు మానిటరింగ్ సెల్ సిబ్బంది పనితీరును అడిగి తెలుసుకుని, గౌరవ న్యాయస్థానాల్లో విచారణలో ఉన్న కేసులు వేగవంతం చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా ఏలూరు, జంగారెడ్డిగూడెం, నూజివీడు, పోలవరం సబ్ డివిజన్లకు చెందిన కోర్టు మానిటరింగ్ సభ్యులతో మాట్లాడి, కేసుల విచారణలో జాప్యం జరగకుండా తగిన సూచనలు, సలహాలు ఇచ్చారు.
కోర్టు మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు జిల్లాలో మొత్తం 43 కేసుల్లో నిందితులకు శిక్షలు పడినట్లు అదనపు ఎస్పీ వెల్లడించారు. అందులో
-
23 జీవిత ఖైదు శిక్షలు (వాటిలో 4 కేసుల్లో డబుల్ లైఫ్ శిక్షలు),
-
3 కేసుల్లో 20 సంవత్సరాల జైలు శిక్ష,
-
9 కేసుల్లో 10 సంవత్సరాల జైలు శిక్ష,
-
3 కేసుల్లో 7 సంవత్సరాల జైలు శిక్ష,
-
4 కేసుల్లో 5 సంవత్సరాల జైలు శిక్ష,
-
1 కేసులో 4 సంవత్సరాల జైలు శిక్ష
విధించబడినట్లు తెలిపారు. ఇదే స్పూర్తితో కోర్టు మానిటరింగ్ సిబ్బంది మరింత సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు.
కేసుల విచారణ వేగంగా జరగాలంటే సాక్షులను సకాలంలో కోర్టుకు హాజరు చేయడం అత్యంత కీలకమని పేర్కొన్న అదనపు ఎస్పీ, ఈ బాధ్యత పూర్తిగా కోర్టు మానిటరింగ్ సెల్ సభ్యులదేనని స్పష్టం చేశారు. నేరస్తులు శిక్ష తప్పించుకోకుండా, బాధితులకు న్యాయం జరిగేలా ముద్దాయిలకు కఠిన శిక్షలు పడే విధంగా పనిచేయాలని ఆదేశించారు.
అలాగే, ప్రతి రోజూ కోర్టులో జరిగిన విచారణ వివరాలను సమగ్రంగా డాక్యుమెంటేషన్ చేసి, తక్షణమే సంబంధిత స్టేషన్ హౌస్ ఆఫీసర్‌కు నివేదించాలని సూచించారు. కోర్టు మానిటరింగ్ సెల్ సభ్యులు తమ పరిధిలోని కేసులను వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తూ, నిత్యం సమీక్ష చేయాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో కోర్టు మానిటరింగ్ ఇన్‌స్పెక్టర్ ఎం. సుబ్బారావు తో పాటు కోర్టు మానిటరింగ్ సెల్ సభ్యులు పాల్గొన్నారు.















Social Plugin