ఏలూరు, జనవరి 31: అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు పారదర్శకంగా, సమర్థవంతంగా అందించేందుకు పటిష్టమైన ప్రణాళికలతో కూటమి ప్రభుత్వం ముందుకెళ్తోందని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని యజ్ఞంలా నిర్వహిస్తున్నామని, పెన్షన్‌దారులకు ఆర్థిక భరోసా కల్పిస్తూ వారి ఆనందాల్లో భాగస్వాములమవుతున్నామని ఆయన పేర్కొన్నారు.
ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని శనివారం పండుగ వాతావరణంలో నిర్వహించారు. స్థానిక 22వ డివిజన్ సత్రంపాడులో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే బడేటి చంటి, ఆర్టీసీ విజయవాడ జోన్–2 చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, నగర కోఆప్షన్ సభ్యులు ఎస్‌ఎంఆర్ పెదబాబులతో కలిసి లబ్ధిదారుల ఇళ్లకే వెళ్లి పెన్షన్లు అందజేశారు. ఈ సందర్భంగా వారికి స్థానికులు అపూర్వ స్వాగతం పలికారు.
అనంతరం పెన్షన్‌దారుల ఇళ్లను సందర్శించిన ఎమ్మెల్యే బడేటి చంటి, వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకుని, ధైర్యం చెప్పారు. పేదల సంతోషాల్లో భాగస్వామిగా నిలవడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ప్రతినెలా పెన్షన్ల పంపిణీలో స్వయంగా పాల్గొంటూ ప్రజలకు అందుబాటులో ఉంటున్నానని ఆయన చెప్పారు. ఫిబ్రవరి 1వ తేదీ ఆదివారం కావడంతో ముందస్తుగా జనవరి 31ననే పెన్షన్లను పంపిణీ చేశామని, పేదల సంక్షేమం, రాష్ట్రాభివృద్ధికి కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ అగ్రతాంబూలం వేస్తుందని స్పష్టం చేశారు.
ఆర్టీసీ విజయవాడ జోన్–2 చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ కూటమి పాలన ప్రజారంజకంగా, సమర్థవంతంగా సాగుతోందన్నారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నరేంద్ర మోడీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజల శ్రేయస్సే ధ్యేయంగా పనిచేస్తోందని పేర్కొన్నారు. ప్రతినెలా సమయానికి పెన్షన్లు అందించడం కూటమి ప్రభుత్వ ప్రత్యేకత అని తెలిపారు.
నగరపాలక సంస్థ కోఆప్షన్ సభ్యులు ఎస్‌ఎంఆర్ పెదబాబు మాట్లాడుతూ, ఇచ్చిన మాట ప్రకారం రూ.3000 ఉన్న పెన్షన్లను ఒకే సంతకంతో రూ.4000కు పెంచి నిరంతరం అందించడం కూటమి ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని అన్నారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ కర్రి శ్రీనివాసరావు, ఈడా చైర్మన్ పెద్దిబోయిన శివప్రసాద్, ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారధి, ఏలూరు కార్పొరేషన్ కమిషనర్ ఎ. భానుప్రతాప్, జనసేన పార్టీ నగర అధ్యక్షులు వీరంకి పండు, జిల్లా కార్యదర్శి కస్తూరి సాయి తేజస్విని, జనసేన క్లస్టర్ ఇన్‌చార్జ్ పేటేటి రామకృష్ణ ప్రసాద్, డివిజన్ ఇన్‌చార్జ్ కన్న ప్రసాద్, 22వ డివిజన్ టీడీపీ ఇన్‌చార్జ్ కొండే నిర్మల రాణి కుమారి, స్థానిక నాయకులు తాడికొండ శ్రీనివాస్, నరహరి శెట్టి వెంకట్ సోమేశ్వరరావు, కన్న దుర్గాభవానీ, బీజేపీ నాయకులు నడపాన దాన భాస్కర్‌తో పాటు వివిధ హోదాలలో ఉన్న కూటమి నాయకులు పాల్గొన్నారు.















Social Plugin