ఎన్టీఆర్ అసాధ్యాలను సుసాధ్యం చేసిన యుగపురుషుడు: ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి


ఏలూరు: సినీ వినీలాకాశంలో యుగపురుషునిగా, రాజకీయ రణక్షేత్రంలో అజేయునిగా చిరస్థాయిగా నిలిచిపోయేంతటి ముద్ర వేసిన మహానేత దివంగత నందమూరి తారక రామారావు అసాధ్యాలనెన్నింటినో సుసాధ్యం చేసి చూపించారని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి కొనియాడారు.


ఏలూరు అమీనాపేటలోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో ఆదివారం టిడిపి వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షులు బడేటి చంటి, మాజీ మంత్రి మాగంటి బాబు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. తొలుత పార్టీ నాయకులతో కలిసి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

అనంతరం నిర్వహించిన సభలో బడేటి చంటి మాట్లాడుతూ, మొక్కవోని దీక్షతో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించి తెలుగువారి ఖ్యాతిని దశదిశలా వ్యాపింపచేశారని గుర్తు చేశారు. ఆ మహానేత వారసత్వాన్ని చెక్కుచెదరని ఆత్మవిశ్వాసంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందుకు తీసుకెళ్తున్నారని స్పష్టం చేశారు.

ఒకవైపు ‘సూపర్ సిక్స్’ సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తూనే, మరోవైపు రాష్ట్రానికి జీవనాడిగా నిలిచే పోలవరం ప్రాజెక్టు, రాజధాని అమరావతి నిర్మాణాలను శరవేగంగా ముందుకు తీసుకెళ్తున్నారని కొనియాడారు. ఎన్టీఆర్ బడుగు, బలహీన వర్గాలకు రాజకీయాలను చేరువ చేసిన మహానేత అని, తమలాంటి అనేక మందికి రాజకీయ జీవితానికి దారి చూపారని పేర్కొన్నారు. తెలుగువారి కీర్తిపతాకాన్ని గగనతలంపై నిలిపిన ఘనత తెలుగుదేశం పార్టీదేనని అన్నారు.

మాజీ మంత్రి మాగంటి బాబు మాట్లాడుతూ, ప్రపంచస్థాయిలో మచ్చలేని నాయకుడిగా ఎన్టీఆర్ నిలిచారని కొనియాడారు. రాష్ట్రాభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమర్థవంతమైన నాయకునిగా బడేటి చంటికి జిల్లా పార్టీ పగ్గాలు అప్పగించడం ఆహ్వానించదగ్గ పరిణామమని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా బడేటి చంటిపై ఆయన ప్రశంసల జల్లు కురిపించారు.

ఈ కార్యక్రమంలో ఈడా చైర్మన్ పెద్దిబోయిన శివప్రసాద్, ఎఎంసి చైర్మన్ మామిళ్ళపల్లి పార్థసారధి, డిప్యూటీ మేయర్ పప్పు ఉమామహేశ్వరరావు, కో-ఆప్షన్ సభ్యులు చోడే వెంకటరత్నం, ఎస్సెమ్మార్ పెదబాబు, పార్టీ జిల్లా మీడియా కో-ఆర్డినేటర్ చల్లా వెంకట సత్యవరప్రసాదరావు, పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు గూడవల్లి వాసు, పార్టీ అధికార ప్రతినిధి పూజారి నిరంజన్, నాయకులు బెల్లపుకొండ కిషోర్‌తో పాటు వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, క్లస్టర్ ఇంచార్జిలు, డివిజన్ ఇంచార్జిలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.