సంక్రాంతి సందర్భంగా అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి – నూజివీడు పోలీసుల పోస్టర్ ప్రచారం


ఏలూరు జిల్లా,నూజివీడు: ఏలూరు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్, నూజివీడు డీఎస్పీ కె.వి.వి.ఎన్.వి. ప్రసాద్ ఆదేశాల మేరకు రానున్న సంక్రాంతి పండుగను పురస్కరించుకొని నూజివీడులో పోలీస్ శాఖ విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టింది.


యువతను అసాంఘిక కార్యకలాపాల నుండి దూరంగా ఉంచి పండుగలను సంప్రదాయ పద్ధతుల్లో శాంతియుతంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో నూజివీడు టౌన్ ఇన్‌స్పెక్టర్ సత్య శ్రీనివాస్ తమ సిబ్బందితో కలిసి పోస్టర్ల ద్వారా విస్తృత స్థాయిలో ప్రచారం నిర్వహించారు.

ఈ ప్రచారంలో భాగంగా సంక్రాంతి పండుగ పేరుతో జరిగే కోడిపందాలు, పేకాట, ఇతర జూద వ్యసనాలకు దూరంగా ఉండాలని ప్రజలకు అవగాహన కల్పించారు. యువత అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడకుండా పెద్దలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

అలాగే పండుగలను ఆనందంగా, శాంతియుతంగా, మన సంప్రదాయాలకు అనుగుణంగా జరుపుకోవాలని నూజివీడు పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా టౌన్ ఇన్‌స్పెక్టర్ సత్య శ్రీనివాస్ మాట్లాడుతూ… సంక్రాంతి పండుగను చట్టబద్ధంగా జరుపుకుంటూ సమాజంలో శాంతి భద్రతలు కాపాడటంలో ప్రతి పౌరుడు బాధ్యతగా వ్యవహరించాలని తెలిపారు.