ఏలూరు జిల్లా, నూజివీడు: ఏలూరు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్, నూజివీడు డీఎస్పీ కె.వి.వి.ఎన్.వి. ప్రసాద్ ఆదేశాల మేరకు, రానున్న సంక్రాంతి పండుగను దృష్టిలో ఉంచుకుని నూజివీడు మండలం తుక్కులూరు గ్రామంలో కోడిపందేలు నిర్వహించేందుకు ఏర్పాటు చేసిన బరులను పోలీసులు ధ్వంసం చేశారు.
నూజివీడు రూరల్ ఇన్‌స్పెక్టర్ కె. రామకృష్ణ, నూజివీడు రూరల్ ఎస్‌ఐలు లక్ష్మణ్ బాబు, జ్యోతి బసు తమ సిబ్బందితో కలిసి ట్రాక్టర్ సహాయంతో ఈ బరులను తొలగించారు.
ఈ సందర్భంగా నూజివీడు రూరల్ ఇన్‌స్పెక్టర్ కె. రామకృష్ణ, రూరల్ ఎస్‌ఐలు లక్ష్మణ్ బాబు, జ్యోతి బసు మాట్లాడుతూ… పండుగ పేరుతో జూద క్రీడలు, కోడిపందేలు నిర్వహించడం చట్టరీత్యా నేరమని స్పష్టం చేశారు. ఇలాంటి అక్రమ కార్యక్రమాలకు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని ప్రజలను హెచ్చరించారు.
అలాగే ప్రజలు పోలీసులకు సహకరించి సంక్రాంతి పండుగను సంప్రదాయ పద్ధతుల్లో శాంతియుతంగా జరుపుకోవాలని కోరారు. ఈ మేరకు నూజివీడు రూరల్ సర్కిల్ పోలీసులు పోస్టర్లు, ప్రచార కార్యక్రమాల ద్వారా ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు.















Social Plugin