హీరో రాజేంద్రప్రసాద్ సమక్షంలో మురళీమోహన్‌ను అభినందించిన మాగంటి బాబు
ఏలూరు/హైదరాబాద్ | జనవరి 26: ప్రముఖ సినీ నటుడు, నిర్మాత, దర్శకుడు, రాజమండ్రి మాజీ పార్లమెంట్ సభ్యులు మాగంటి మురళీమోహన్‌కు జాతీయ స్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మకమైన పద్మశ్రీ అవార్డు లభించడం ఎంతో ఆనందదాయకమని, రాష్ట్ర మాజీ మంత్రి, ఏలూరు మాజీ పార్లమెంట్ సభ్యులు మాగంటి వెంకటేశ్వరరావు (బాబు) అన్నారు.
ఈ సందర్భంగా సోమవారం ఉదయం 10:30 గంటలకు హైదరాబాద్‌లోని మురళీమోహన్ జైభేరి ఆరంజ్ కౌంటీ నివాసంలో మురళీమోహన్‌ను కలిసి మాగంటి బాబు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్ కూడా పాల్గొని మురళీమోహన్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
మాగంటి బాబు మాట్లాడుతూ, “మురళీమోహన్ మాకు రక్తబంధువు, చిన్ననాటి స్నేహితుడు. ఇలాంటి ప్రతిష్టాత్మక అవార్డులు పొందడం మా కుటుంబానికే కాదు, మా అందరికీ గర్వకారణం. ఆయన మరెన్నో ఉన్నతమైన అవార్డులు అందుకోవాలని ఆకాంక్షిస్తున్నాను” అని తెలిపారు.
అలాగే మురళీమోహన్ ఏలూరు జిల్లాకు చెందిన వ్యక్తి కావడం వల్ల జిల్లా మొత్తం హర్షాతిరేకాల్లో మునిగిపోయిందని, ఆయన కేవలం జిల్లా స్థాయి వ్యక్తి కాదని, రాష్ట్రవ్యాప్తంగా అత్యంత ఫాలోయింగ్ ఉన్న గొప్ప నటుడిగా సినీ రంగంలో పెద్దన్నగా నిలిచారని కొనియాడారు. దేవుడు ఆయనకు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా మురళీమోహన్ మాట్లాడుతూ, “మా బాబు చాలా మంచి మనిషి. ఆయన తండ్రి మాగంటి రవీంద్రనాథ్ చౌదరి మా అందరికీ ఆదర్శనీయులు. బాబుకు రాజకీయాల్లో కూడా మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాను” అని తెలిపారు.
అలాగే తనకు పద్మశ్రీ అవార్డు రావడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు.
















Social Plugin