మేర్నిపాడు వైసీపీ సర్పంచ్‌కు అవమానం
గణతంత్ర వేడుకలకు ఆహ్వానం లేదు – సిబ్బంది నిర్వాకంపై ఆగ్రహం
రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారని సర్పంచ్ ఆవేదన
మండపేట ఫ్లాష్ న్యూస్ | జనవరి 26: మండపేట మండలం మెర్నిపాడు గ్రామ సర్పంచ్, వైసీపీ నాయకురాలు గారపాటి సౌజన్య అశోక్ కుమార్‌కు తీవ్ర అవమానం చోటుచేసుకుంది. గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో నిర్వహించిన 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు సర్పంచ్‌కు కనీస ఆహ్వానం కూడా అందకపోవడం తీవ్ర వివాదానికి దారితీసింది. పంచాయతీ కార్యదర్శి, సిబ్బంది నిర్వాకమే ఈ ఘటనకు కారణమని సర్పంచ్ ఆరోపించారు.
సాధారణంగా మండపేట నియోజకవర్గంలో ఇటువంటి రాజకీయాలకు తావు ఉండదని, అయితే సర్పంచ్‌ల పదవీకాలం ముగింపు దశకు చేరుకున్న సమయంలో వైసీపీ సర్పంచ్‌కు కావాలనే అవమానం జరిగిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ గారపాటి సౌజన్య అశోక్ కుమార్ మాట్లాడుతూ, గ్రామ పంచాయతీ కార్యదర్శి రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. మెర్నిపాడు సర్పంచ్ హోదాలో ఇది తమకు చివరి జెండా వందన కార్యక్రమమై ఉండగా, అలాంటి సందర్భంలో కూడా పంచాయతీ సిబ్బంది నుంచి కనీస సమాచారం అందకపోవడం దారుణమన్నారు.
“మారింది ప్రభుత్వం మాత్రమే… రాజ్యాంగం కాదు. ఒక ప్రజాప్రతినిధిగా సర్పంచ్‌కు ఉండాల్సిన గౌరవం ఇవ్వకపోవడం రాజ్యాంగ విరుద్ధం” అని ఆమె స్పష్టం చేశారు. ఇది పంచాయతీ కార్యదర్శి లోపమా? లేక కూటమి నాయకుల ప్రోత్సాహంతో జరిగిందా? అనే అనుమానం వ్యక్తం చేశారు.
సర్పంచ్ పదవీకాలం ముగుస్తోంది కాబట్టి, ఇక పట్టించుకోనక్కర్లేదన్న ధోరణితో సిబ్బంది వ్యవహరిస్తున్నారేమోనని ఆమె విమర్శించారు. తిరిగి వచ్చే ఎన్నికల్లో ప్రజల మద్దతుతో గెలిచి వస్తే కూడా ఇలాగే వ్యవహరిస్తారా? అంటూ ప్రశ్నించారు.
ఇటీవల కొత్తగా వచ్చిన పంచాయతీ సిబ్బంది నుంచి ఏ విషయమూ తమకు తెలియడం లేదని, ఎస్సీ కాలనీలో చేపట్టాల్సిన డ్రైనేజీ, కల్వర్టు పనులకు సుమారు ఏడాది క్రితమే అంచనాలు చేయాలని చెప్పినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరికి గణతంత్ర దినోత్సవ వేడుకలకు కూడా ఆహ్వానం పంపకపోవడం హద్దులు దాటిన వ్యవహారమన్నారు.
తమకు జరిగిన అవమానాన్ని ప్రజల దృష్టికి తీసుకురావడానికే ఈ విషయాన్ని వెల్లడిస్తున్నానని, పంచాయతీ సిబ్బంది పనితీరుపై తాము గమనించట్లేదని అనుకోకుండా ఉండేందుకే ఈ హెచ్చరిక అని తెలిపారు. ఈ అవమానాలకు త్వరలోనే గట్టి సమాధానం చెప్పే అవకాశం వస్తుందని, అప్పుడు అన్ని విషయాలు వెల్లడిస్తానని హెచ్చరించారు.
ఈ అంశాన్ని సర్పంచ్ పంచాయతీ వాట్సాప్ గ్రూపులో పంచుకోవడంతో నియోజకవర్గం మొత్తం ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది.















Social Plugin