పోలవరం ప్రాజెక్ట్‌ను పరిశీలించేందుకు విదేశీ నిపుణుల బృందం పర్యటన


ఏలూరు జిల్లా, పోలవరం: పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనుల పురోగతిని ప్రత్యక్షంగా పరిశీలించేందుకు విదేశీ నిపుణుల బృందం సోమవారం ప్రాజెక్ట్ నిర్మాణ ప్రాంతానికి చేరుకుంది. ఈ సందర్భంగా జలవనరుల శాఖ అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులు నిపుణుల బృందానికి ఘన స్వాగతం పలికారు.


ఈ బృందంలో విదేశీ నిపుణులు సీన్ హించిబెర్గెర్, డేవిడ్ బి. పాల్, జియాన్ ఫ్రాంకో డి సీకో ఉన్నారు. వీరు పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ ప్రాంతాన్ని ఆరో విడతగా పరిశీలిస్తున్నారు.

విదేశీ నిపుణుల వెంట కేంద్ర జల సంఘానికి చెందిన అధికారులు సరబ్జిత్ సింగ్ బక్షి, మనీష్ రాథోర్, గౌరవ్ తివారి, హేమంత్ గౌతమ్, సీఎస్‌ఎమ్‌ఆర్‌ఎస్ అధికారులు మనీష్ గుప్తా, రవి అగర్వాల్, సీడబ్ల్యూపీఆర్‌ఎస్ ప్రతినిధి వి.ఎస్. రామారావు, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సభ్య కార్యదర్శి ఎం. రఘురాం, డైరెక్టర్ కె. శంకర్, ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ సలహాదారు ఎం. వెంకటేశ్వర రావు, ఎన్‌ఐఆర్‌ఎం డైరెక్టర్ అజయ్ కుమార్ నైతాని, సీడీఓ చీఫ్ ఇంజనీర్ తదితరులు పాల్గొన్నారు.

వీరికి జలవనరుల శాఖ ఈఎన్‌సీ కె. నరసింహమూర్తి, పోలవరం ఎస్‌ఈ రామచంద్ర రావు, నిర్మాణ సంస్థ ఏం.ఈ.ఐ.ఎల్ జనరల్ మేనేజర్ గంగాధర్, డీజీఎం మురళి పమ్మి స్వాగతం పలికారు. అనంతరం జలవనరుల శాఖ అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులు ప్రాజెక్ట్ పనుల ప్రస్తుత స్థితి, పురోగతిపై నిపుణుల బృందానికి వివరించారు.

ఈ సందర్భంగా నిపుణుల బృందం గ్యాప్-1, డి హిల్, గ్యాప్-2, జి హిల్, ప్రధాన డ్యామ్ ఎగువ–దిగువ భాగాలు, డి వాల్, డీ వాటరింగ్ ఛానల్, రాక్ ఫిల్, క్లే స్టాక్ ప్రాంతాలను పరిశీలించారు. ప్రాజెక్ట్ నిర్మాణంలో నాణ్యత, భద్రత ప్రమాణాలు, భవిష్యత్ కార్యాచరణపై సమీక్ష నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.