ఏలూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ – 35 ఫిర్యాదుల స్వీకరణ


ఏలూరు జిల్లా, ఏలూరు: జిల్లాలో ప్రజల సమస్యల పరిష్కారానికి నిర్వహిస్తున్న పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ – ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని సోమవారం ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్, అదనపు ఎస్పీ ఎన్. సూర్య చంద్ర రావు నిర్వహించారు.


ఈ కార్యక్రమంలో ఫిర్యాదుల స్వీకరణను పూర్తిగా పేపర్‌లెస్ విధానంలో, పారదర్శకంగా చేపట్టారు. ప్రజలు తమ విలువైన సమయం, డబ్బు వృథా చేయకుండా నేరుగా తమ సమీప సబ్-డివిజన్, సర్కిల్ పోలీసు అధికారులకు ఫిర్యాదులు అందజేయవచ్చని ఎస్పీ గారు తెలిపారు. అలాగే ఆన్‌లైన్ ద్వారా ఫిర్యాదులు చేయాలనుకునే వారు https://meekosam.ap.gov.in https://meekosam.ap.gov.in వెబ్‌సైట్‌ను ఉపయోగించుకోవచ్చని సూచించారు. ఫిర్యాదుల స్థితిగతులను తెలుసుకోవడానికి 1100 టోల్ ఫ్రీ నెంబర్ ను సంప్రదించవచ్చని వెల్లడించారు.

ఈరోజు మొత్తం 35 ఫిర్యాదులు అందగా, వాటిలో అధికంగా భూ వివాదాలు, కుటుంబ తగాదాలు, మోసపూరిత లావాదేవీలకు సంబంధించిన ఫిర్యాదులు ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడిన ఎస్పీ, ఆయా సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఫిర్యాదులపై చట్ట ప్రకారం విచారణ జరిపి నివేదికలు సమర్పించాలని సంబంధిత అధికారులకు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.

యోగి వేమన జయంతిని పురస్కరించుకొని, పోలీస్ ప్రధాన కార్యాలయంలో అదనపు ఎస్పీ (అడ్మిన్) యోగి వేమన గారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఫిర్యాదుదారులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. సోషల్ మీడియా ద్వారా జరుగుతున్న మోసాలు, డిజిటల్ అరెస్ట్ పేరుతో మోసాలు, తక్కువ సమయంలో లోన్ ఇస్తామని చెప్పే లోన్ యాప్ మోసాలు, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ ద్వారా వచ్చే ఏపీకే యాప్‌ల వల్ల కలిగే నష్టాలపై అధికారులు వివరించారు. ఎవరైనా సైబర్ నేరాలకు గురైతే వెంటనే 1930 నెంబర్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు. తమతో పాటు కుటుంబ సభ్యులు, పరిసరాల వారిని కూడా జాగ్రత్తగా ఉండేలా చైతన్యం కల్పించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ఏఆర్, ఆర్‌ఐ సతీష్, పవన్ కుమార్, జీలుగుమిల్లి ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వర రావు, ఆర్‌ఎస్‌ఐ భాస్కర రావు, డీసీఆర్‌బీ ఎస్‌ఐ రామకృష్ణ, మహిళా ఎస్‌ఐ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. అలాగే పబ్లిక్ గ్రీవెన్స్‌కు హాజరైన ఫిర్యాదుదారులకు ఏలూరు శ్రీ సత్య సాయి సేవా సంఘం వారి సహకారంతో భోజన ఏర్పాట్లు చేసినట్లు జిల్లా పోలీస్ యంత్రాంగం తెలిపింది.