డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, ఆలమూరు మండలం: ఆలమూరు రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్లు 501 నుండి 520 వరకు సుమారు 171 మంది షెడ్యూల్ కులాలకు చెందిన పేద రైతులకు 1977లో ప్రభుత్వం ఇచ్చిన డి.ఫారం భూముల పట్టాలను కౌలు రైతుల నుంచి స్వాధీనం చేసుకుని, తిరిగి ఇప్పించాలని లబ్ధిదారులు డిమాండ్ చేశారు.
ఈ మేరకు సోమవారం మండల కేంద్రమైన ఆలమూరు గ్రామానికి చెందిన బాధిత రైతులు స్థానిక మండల పరిషత్ కార్యాలయం వద్ద ఏర్పాటుచేసిన గ్రీవెన్స్ సెల్ లో అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో పేద రైతులకు ఇచ్చిన డి.పట్టా భూముల్లో వ్యవసాయం చేసుకుంటూ జీవనోపాధి పొందేవారన్నారు.
అయితే కొంతకాలంగా పంట దిగుబడులు తగ్గడంలో పేద రైతులు తమ భూములను స్థానిక కొమరాజులంక రైతులకు కౌలుకి ఇచ్చి జీవనోపాధి కోసం పనులు వెతుక్కుంటూ వలస పోవడం జరిగిందన్నారు. తరువాత పేద రైతులు గ్రామాలకు తిరిగి వచ్చి ఏళ్ల తరబడి తమ భూములను అప్పగించాలని కౌలు రైతులను అడుగుతుంటే ఇవ్వకపోగా, తెల్ల కాగితాలపై సంతకాలు,వేలిముద్రలు వేయించుకుని దౌర్జన్యం చేస్తున్నారన్నారు.
అలాగే పంట భూముల్లోకి వెళుతుంటే అడ్డుకుంటూ బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంపై ఎన్నోసార్లు జిల్లా కలెక్టర్ వారికి, రెవెన్యూ సిబ్బందికి, రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషనర్ వారికి వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ ప్రయోజనం లేదని కావున బాధితులకు తగిన న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతులు యళ్ల విష్ణువర్ధన్ రాజు, నేతల రాజారావు, గూటం గంగరాజు, దాసరి దాసు, దిడ్డి కుమారి, తదితరులు పాల్గొన్నారు.















Social Plugin