విద్యా వికాస్ సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా


ఏలూరు జిల్లా, జంగారెడ్డిగూడెం: పట్టణంలో విద్యా వికాస్ విద్యా సంస్థల సిల్వర్ జూబ్లీ వేడుకలు మంగళవారం సాయంత్రం అత్యంత వైభవంగా నిర్వహించారు. 25 సంవత్సరాల విద్యా సేవల ప్రస్థానాన్ని గుర్తుచేసేలా ఈ వేడుకలు ఉత్సాహభరిత వాతావరణంలో జరిగాయి.


ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చింతలపూడి శాసనసభ్యులు సొంగా రోషన్ కుమార్, కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు, ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ చైర్మన్ బూరుగుపల్లి శేషరావు హాజరయ్యారు. వీరితో పాటు కూటమి నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

కార్యక్రమంలో పట్టణానికి చెందిన పలువురు వక్తలు విద్యా వికాస్ సంస్థల సేవలను ప్రశంసిస్తూ మాట్లాడారు. విద్యా రంగంలో సంస్థ చేసిన కృషి, విద్యార్థుల భవిష్యత్తు నిర్మాణంలో పోషిస్తున్న పాత్రను వారు ప్రత్యేకంగా ప్రస్తావించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ మాట్లాడుతూ, విద్యార్థులు స్పష్టమైన లక్ష్యంతో ముందుకు సాగాలని సూచించారు. విద్యా వికాస్ యాజమాన్యం 25 సంవత్సరాల క్రితం వేసిన పునాదుల నుంచి నేటి స్థాయికి చేరుకోవడంలో చూపిన ఓర్పు, సహనం ప్రశంసనీయమన్నారు. కష్టపడి పని చేస్తే విజయాలు తప్పక వస్తాయని ఆయన తెలిపారు.

తన ప్రసంగానికి ముందు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే, ఈ వేడుకలు అందరిలో కొత్త ఉత్సాహం, జోష్ నింపాయని అన్నారు. విద్యా వికాస్ సంస్థ మరిన్ని సంవత్సరాలు విద్యా సేవలు అందిస్తూ ముందుకు సాగాలని ఆకాంక్షించారు.