ఏలూరు జిల్లా, జంగారెడ్డిగూడెం: సూర్య కిరణ్ ఫంక్షన్ హాల్స్ ప్రాంగణంలో ఈ నెల 9వ తేదీ శుక్రవారం ఉదయం 9 గంటల నుండి జరగనున్న శ్రీ శ్రీ శ్రీనివాస కళ్యాణ మహోత్సవాల ఏర్పాట్లను స్థానిక ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ గారు పరిశీలించారు. రాములమ్మ చెలక ప్రాంగణంలో నిర్వహించనున్న ఈ మహోత్సవానికి జరుగుతున్న ఏర్పాట్లను ఆయన స్వయంగా పర్యవేక్షించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోషన్ కుమార్ మాట్లాడుతూ, రాజాన సత్యనారాయణ (పండు) ఆధ్వర్యంలో ఫంక్షన్ హాల్స్ ప్రాంగణంలో చేపట్టిన ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. కళ్యాణంలో పాల్గొనే దంపతులకు, గ్రామ భక్త మహాజనులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని విధాల ఏర్పాట్లు చేయాలని నిర్వాహకులకు సూచించారు.
అనేక వ్యయ ప్రయాసలను అధిగమించి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వారి సహకారంతో శ్రీ శ్రీ శ్రీనివాస కళ్యాణ మహోత్సవాన్ని ఏర్పాటు చేయడం ఎంతో విశేషమని తెలిపారు. స్వామి వారి అనుగ్రహంతో ఈ పవిత్ర కార్యక్రమం సాధ్యమైందని, ప్రజలందరూ ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వేద పండితులు, కళ్యాణ ఉత్సవ మూర్తులు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నట్లు ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, పట్టణ ప్రముఖులు, మహిళలు, గ్రామ భక్త మహాజనులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారని సూర్య కిరణ్ ఫంక్షన్ హాల్స్ అధినేత డాక్టర్ రాజాన సత్యనారాయణ (పండు) వెల్లడించారు.















Social Plugin