ఆగిరిపల్లిలో బాబు జగ్జీవన్ రామ్ నూతన విగ్రహం ఆవిష్కరణ – మంత్రి కొలుసు పార్థసారథి


ఏలూరు జిల్లా, ఆగిరిపల్లి: ఆగిరిపల్లి మండలం, ఆగిరిపల్లి గ్రామంలో మాజీ ఉప ప్రధాన మంత్రి, ప్రముఖ జాతీయ నాయకులు బాబు జగ్జీవన్ రామ్ గారి నూతన విగ్రహాన్ని రాష్ట్ర గృహ నిర్మాణ మరియు సమాచార–పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి గారు ఘనంగా ఆవిష్కరించారు.


ఈ సందర్భంగా మంత్రి పార్థసారథి మాట్లాడుతూ, బాబు జగ్జీవన్ రామ్ గారు సుమారు 30 సంవత్సరాల పాటు కేంద్ర మంత్రిగా దేశానికి విశేష సేవలు అందించిన గొప్ప నాయకుడని కొనియాడారు. వ్యవసాయ, కార్మిక, రక్షణ శాఖలలో అనేక సంస్కరణలు తీసుకువచ్చి దేశ అభివృద్ధికి ఎనలేని సేవలు చేశారని తెలిపారు.

సమాజంలోని దళితులు ఉన్నత విద్యను అభ్యసించి, మంచి ఉద్యోగాలు సాధించి ఆర్థికంగా, రాజకీయంగా ఎదగాలని మంత్రి పిలుపునిచ్చారు. బడుగు, బలహీన వర్గాల అభివృద్ధే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని ఈ సందర్భంగా గుర్తుచేశారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, అధికారులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.