చింతలపూడిలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు


ఏలూరు జిల్లా, చింతలపూడి: చింతలపూడి పట్టణంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక శాసనసభ్యులు సొంగ. రోషన్ కుమార్ వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో ఏర్పాటు చేసిన గణతంత్ర వేడుకల్లో పాల్గొన్నారు.


వేడుకలలో భాగంగా వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో మినరల్ వాటర్ ప్లాంట్‌ను ఎమ్మెల్యే ప్రారంభించారు. పరిసర ప్రాంత ప్రజలు తాగునీటి కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ దుర్గా పార్వతి ఈ ప్లాంట్‌ను పునఃప్రారంభించినట్లు తెలిపారు. ప్రజలకు ఉచితంగా శుద్ధి చేసిన తాగునీరు అందుబాటులో ఉంటుందని ఆమె స్పష్టం చేశారు.

అనంతరం మార్కెట్ యార్డ్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

చింతలపూడిలోని స్థానిక ఎండీఓ, ఎమ్మార్వో కార్యాలయాలు, నగర పంచాయతీ, సొసైటీలు, జాతీయ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల్లో కూడా జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమాలు జరిగాయి.

ఈ వేడుకల్లో ఆయా కార్యాలయాల సిబ్బందితో పాటు కూటమి నాయకులు, కార్యకర్తలు, పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.