ఏలూరు జిల్లా,ఆగిరపల్లి: నూజివీడు డీఎస్పీ కె.వి.వి.ఎన్.వి. ప్రసాద్ ఆదేశాల మేరకు నూజివీడు రూరల్ సీఐ కె. రామకృష్ణ, ఆగిరిపల్లి ఎస్‌ఐ శుభ శేఖర్ తమ సిబ్బందితో కలిసి ఆగిరిపల్లి మండలం గ్రామ పరిధిలో విస్తృతంగా విజిబుల్ పోలీసింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా హెల్మెట్ వినియోగం, సైబర్ నేరాలపై డయల్–112 సేవలపై ప్రజలకు అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ నూజివీడు రూరల్ ఇన్స్పెక్టర్ కె. రామకృష్ణ రోడ్డు భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, హెల్మెట్ వాడటం వల్ల ప్రమాదాల సమయంలో ప్రాణాపాయం నుంచి రక్షణ పొందవచ్చని ఆయన తెలిపారు.
అలాగే వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని, అతివేగంగా వాహనాలు నడపరాదని హితవు పలికారు. “వేగం వద్దు – ప్రాణం ముద్దు” అనే నినాదాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని కోరారు. ప్రమాదం జరిగిన తర్వాత బాధపడే కంటే ముందే జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో మేలని ఆయన అన్నారు.
విజిబుల్ పోలీసింగ్ సందర్భంగా సైబర్ నేరాలపై కూడా ప్రజలకు అవగాహన కల్పించారు. సైబర్ నేరగాళ్లకు అవకాశాలు ఇవ్వకుండా తమ డబ్బును కాపాడుకోవాలని సూచించారు. ఎవ్వరైనా సైబర్ నేరాలకు గురైతే వెంటనే 1930 నంబర్‌కు సమాచారం అందించాలని, అలా చేస్తే తక్షణమే సహాయ సహకారాలు అందిస్తారని తెలిపారు. అలాగే అత్యవసర పరిస్థితుల్లో డయల్ 112 కు సమాచారం ఇచ్చి పోలీసుల సహాయం పొందవచ్చని వివరించారు.















Social Plugin