ఏలూరు జిల్లా,నూజివీడు: తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగించిన ఘటనకు నిరసనగా నూజివీడులో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి శ్రీ కొలుసు పార్థసారథి గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూజివీడు పట్టణ బస్టాండ్ వద్ద నుంచి వెంకటాచల స్వామి ఆలయం (వెంకటేశ్వర స్వామి కోవెల్) వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.
ర్యాలీ అనంతరం ఆలయంలో శుద్ధి కార్యక్రమాలు చేపట్టి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. లడ్డూ ప్రసాదం పవిత్రతకు భంగం కలిగించిన ఈ ఘటనకు నిరసనగా భక్తులు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డూ తయారీలో 68.17 లక్షల కిలోల మేరకు కల్తీ నెయ్యి వినియోగించిన మహా దుర్ఘటన చోటుచేసుకుందని తీవ్ర ఆరోపణలు చేశారు. అది అసలు నెయ్యి కాకుండా, పామాయిల్‌కు రసాయనాలు కలిపిన ద్రవం, జంతువుల కొవ్వుతో తయారైన సింథటిక్ ఘీ అని ఆయన తెలిపారు.
ఈ కల్తీ నెయ్యితోనే సుమారు 20 కోట్ల లడ్డూ ప్రసాదాలు తయారు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయని, ఈ వ్యవహారంలో వైసీపీ పెద్దలు రూ.251 కోట్ల మేర అక్రమ లాభాలు పొందారని మంత్రి విమర్శించారు.
తిరుమల లడ్డూ వంటి పవిత్ర ప్రసాదంలో కల్తీ చేయడం హిందూ ధర్మానికి, కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి ఘోర అవమానమని ఆయన పేర్కొన్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను మంత్రి డిమాండ్ చేశారు.















Social Plugin