పడమర వీధి అమ్మవార్ల జాతర ముగింపుకు విస్తృత ఏర్పాట్లు – లక్షలాది భక్తులకు అన్ని సౌకర్యాలు : ఎస్‌ఎంఆర్ పెదబాబు


ఏలూరు జిల్లా,ఏలూరు: ఏలూరు పడమర వీధి అమ్మవార్ల జాతర ముగింపు కార్యక్రమానికి ఇతర ప్రాంతాల నుంచి తరలివచ్చే లక్షలాది మంది భక్తులు, స్థానిక ప్రజలకు నగరపాలక సంస్థ పరంగా అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నట్లు ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ కో-ఆప్షన్ సభ్యులు శ్రీ ఎస్.ఎం.ఆర్. పెదబాబు తెలిపారు.


ఏలూరు శాసనసభ్యులు శ్రీ బడేటి రాధాకృష్ణయ్య, నగరపాలక సంస్థ మేయర్ శ్రీమతి షేక్ నూర్జహాన్ పెదబాబు ఆదేశాల మేరకు శుక్రవారం సాయంత్రం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అదనపు కమిషనర్ డి. శ్రీనివాస్, డిప్యూటీ కమిషనర్ బి. శివారెడ్డితో పాటు 16 సర్కిల్స్‌కు చెందిన సానిటరీ ఇన్స్పెక్టర్లు, సానిటేషన్ మేస్త్రీలు, ఇంజనీరింగ్ విభాగం డీఈలు, ఏఈలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎస్.ఎం.ఆర్. పెదబాబు మాట్లాడుతూ, పడమర వీధి అమ్మవార్ల జాతర ముగింపు సందర్భంగా ఆదివారం కుంభం పోసే రోజు, సోమవారం కొర్ల బండి ఊరేగింపుకు వివిధ రాష్ట్రాలు, జిల్లాలు, చుట్టుపక్కల గ్రామాల నుంచి సుమారు 7 లక్షల మందికి పైగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని జాతర కమిటీ అధ్యక్షులు చోడే బాలు అంచనా వేశారని తెలిపారు.

భక్తుల సంఖ్యను దృష్టిలో పెట్టుకొని శానిటేషన్ వ్యవస్థను మరింత బలోపేతం చేసినట్లు తెలిపారు. ఇప్పటికే విధుల్లో ఉన్న సిబ్బందికి అదనంగా 6 మంది సానిటరీ ఇన్స్పెక్టర్లు, 6 మంది మేస్త్రీలు, 150 మంది సిబ్బందితో మూడు షిఫ్టులుగా డ్యూటీలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. సిబ్బందికి అవసరమైన యాప్రాన్లు, చేతి గ్లౌజులు, మాస్కులు కొత్తవిగా అందించాలని అధికారులకు ఆదేశించామని చెప్పారు.

ఇంజనీరింగ్ విభాగం అధికారులు కొర్ల బండి ఊరేగింపు వెళ్లే మార్గంలో ఉన్న గుంటలను పూడ్చివేసి, అడ్డుగా ఉన్న ఫ్లెక్సీలు, చెట్ల కొమ్మలను తొలగించినట్లు తెలిపారు. అమ్మవార్ల దర్శనానికి వచ్చే మూడు ప్రధాన మార్గాల్లో పురుషులు, మహిళలకు వేర్వేరుగా మొబైల్ టాయిలెట్స్ ఏర్పాటు చేశామని అన్నారు.

విద్యుత్ భద్రత దృష్ట్యా ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్ల వద్ద రక్షణ తడికలు ఏర్పాటు చేయడంతో పాటు, డ్రైనేజీలపై సిమెంట్ బిల్లలు వేయించినట్లు తెలిపారు. తాగునీటి సరఫరాలో భాగంగా ప్రతిరోజూ రెండు పూటలుగా ఇచ్చే నీటిని ఉదయం అరగంట, సాయంత్రం అరగంట అదనంగా సరఫరా చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.

వీధిలైట్లు నిలిచిపోకుండా ప్రత్యేక లైన్ ఏర్పాటు చేసుకోవాలని ఎలక్ట్రికల్ డీఈకి సూచించినట్లు చెప్పారు. జిల్లా కలెక్టర్ శ్రీమతి వెట్రి సెల్వి ఇప్పటికే మూడు దఫాలుగా మున్సిపల్ అధికారులతో సమీక్షలు నిర్వహించారని తెలిపారు.

అలాగే వివిధ వేషాలు వేసుకుని వచ్చే కళాకారులకు, పోలీసు సిబ్బందికి టూ టౌన్ ప్రాంతంలోని పాఠశాలల్లో వసతి ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భక్తుల భద్రత కోసం ప్రత్యేక మెడికల్ క్యాంపులు, అంబులెన్స్‌లు, ఫైర్ ఇంజన్‌లను ముందస్తుగా ఏర్పాటు చేసినట్లు ఎస్.ఎం.ఆర్. పెదబాబు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా అమ్మవార్ల దర్శనానికి వచ్చే ప్రజానికం జాతర కమిటీ సభ్యులకు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది, పోలీసులకు పూర్తి సహకారం అందించి, అమ్మవార్ల అనుగ్రహంతో సుఖసంతోషాలతో ఉండాలని ఆయన కోరారు.