దివ్యాంగుల సంక్షేమానికి అండగా ఉంటా – ఎంపీ పుట్టా మహేష్ కుమార్


ఏలూరు జిల్లా, ఏలూరు: దివ్యాంగులకు ఎల్లవేళలా అండగా ఉంటానని, వారి సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తానని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ హామీ ఇచ్చారు. మంగళవారం ఉదయం ఏలూరు పట్టణ సమీపంలోని దొండపాడులో ఉమా ఎడ్యుకేషనల్, టెక్నికల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జిల్లా దివ్యాంగుల పునరావాస కేంద్రాన్ని ఆయన సందర్శించారు.


ఈ సందర్భంగా సీఎస్ఆర్ నిధుల ద్వారా ఇఫ్కో–టోక్యో సంస్థ అందజేసిన వివిధ సహాయక పరికరాలను 70 మంది విభిన్న ప్రతిభావంతులకు ఎంపీ పంపిణీ చేశారు. ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్యతో కలిసి వినికిడి పరికరాలు, ట్రైసైకిల్స్, కృత్రిమ అవయవాలు తదితర ఉపకరణాలను అందజేశారు.

దివ్యాంగుల జీవితాల్లో భరోసా కల్పించే విధంగా సంస్థ చేపడుతున్న సేవలను ఎంపీ ప్రశంసించారు. భవిష్యత్తులో కూడా సీఎస్ఆర్ నిధుల ద్వారా దివ్యాంగులను ఆదుకునేందుకు తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో ఏలూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (EUDA) చైర్మన్ పెద్దిబోయిన శివప్రసాద్, దివ్యాంగుల సంస్థ కోఆర్డినేటర్ డి. శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.