పేద ఆడపిల్లల భవిష్యత్తుకు బాట వేసిన పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు


సుకన్య సంరక్షణ యోజన కింద 50 మందికి పోస్టల్ ఖాతాల ప్రారంభం


ఏలూరు జిల్లా,జీలుగుమిల్లి: పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు పుట్టినరోజు సందర్భంగా మరో సేవా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. జీలుగుమిల్లి మండలానికి చెందిన పేద కుటుంబాల నుంచి ఎంపిక చేసిన 50 మంది ఆడపిల్లలకు వారి భవిష్యత్తు భద్రత లక్ష్యంగా చిర్రి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ సుకన్య సంరక్షణ యోజన పథకం కింద రూ.10,000 రూపాయలతో 50 పోస్టల్ ఖాతాలు తెరిచే విధంగా చర్యలు చేపట్టారు.

ఈ సందర్భంగా పోస్టల్ ఖాతాల ప్రారంభానికి అవసరమైన నగదును పోలవరం ఎమ్మెల్యే కుమార్తె చిర్రి కీర్తన చేతుల మీదుగా పోస్టల్ అధికారులకు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమం మహిళా సాధికారతకు, ఆడపిల్లల భవిష్యత్తు రక్షణకు నిదర్శనంగా నిలిచిందని పలువురు ప్రశంసించారు.

ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే చిర్రి బాలరాజు గారు మాట్లాడుతూ.. “ఆడపిల్లల విద్య, ఆరోగ్యం, భవిష్యత్తు భద్రతే నా జీవిత లక్ష్యం. పుట్టినరోజును  సేవకు అంకితం చేయాలన్న సంకల్పంతో ఈ కార్యక్రమం చేపట్టాం. ప్రతి ఆడపిల్ల స్వావలంబన సాధించేలా ప్రభుత్వం అందిస్తున్న పథకాలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలి” అని తెలిపారు.

ఈ సేవా కార్యక్రమంలో ఎమ్మెల్యే తండ్రి చిర్రి కృష్ణయ్య, సంబంధిత పోస్టల్ శాఖ అధికారులు, పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచే విధంగా, ఎమ్మెల్యే బాలరాజు సేవా దృక్పథానికి మరో మైలురాయిగా నిలిచింది.