గవరవరంలో సంక్రాంతి సంబరాలు ఘనం… విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలకు మంత్రముగ్ధులైన అతిథులు


శ్రీ వెంకటపతి రాజు సాయి రాకేష్ విద్యా సంస్థల వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు

గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యమైన విద్యతోనే సానుకూల మార్పు సాధ్యం – విద్యాభివృద్ధిపై ఎమ్మెల్యే చిర్రి బాలరాజు వ్యాఖ్యలు

ఏలూరు జిల్లా,కొయ్యలగూడెం: కొయ్యలగూడెం మండలం గవరవరం గ్రామంలో శ్రీ వెంకటపతి రాజు సాయి రాకేష్ విద్యా సంస్థల ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఘనంగా నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా విద్యా సంస్థల ప్రాంగణం పండుగ వాతావరణంతో కళకళలాడింది. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, సంక్రాంతి సంప్రదాయాలను ప్రతిబింబించే నృత్యాలు, పాటలు, ముగ్గుల ప్రదర్శనలు హాజరైన వారిని విశేషంగా ఆకట్టుకున్నాయి. ఎమ్మెల్యే విద్యార్థుల ప్రతిభను ప్రశంసిస్తూ వారిని ప్రోత్సహించారు.

అనంతరం విద్యా సంస్థల యాజమాన్యం, అధ్యాపకులు, గ్రామ పెద్దలు కలిసి పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ని శాలువా, పుష్పగుచ్ఛాలతో ఘనంగా సన్మానించారు. ఈ సన్మాన కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే చిర్రి బాలరాజు మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యమైన విద్య అందుబాటులోకి రావడం వల్లే సమాజంలో సానుకూల మార్పు సాధ్యమవుతుందని అన్నారు. విద్యతో పాటు విద్యార్థుల్లో నైతిక విలువలు, సంప్రదాయాలు పెంపొందించడంలో ఇటువంటి విద్యా సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి పెద్దపీట వేస్తోందని, భవిష్యత్‌లో విద్యారంగానికి మరింత సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు, రాష్ట్ర బీజేపీ నాయకులు నిర్మలా కిషోర్, జిల్లా బీజేపీ అధ్యక్షుడు విక్రమ కిషోర్, వంక కాంచనమాల, కొయ్యలగూడెం సొసైటీ ప్రెసిడెంట్ దుగ్గిన శ్రీనివాస్,
కోన కుమార్, మన్నిడి సాయిబాబా, పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, విద్యా సంస్థల ప్రతినిధులు, అధ్యాపకులు, విద్యార్థులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.