మోడరన్ జూనియర్ కాలేజీలో అంబరాన్నంటిన సంక్రాంతి సంబరాలు


రామచంద్రపురం: రామచంద్రపురంలో మోడరన్ జి.ఆర్.సి. జూనియర్ కాలేజీలో శనివారం సంక్రాంతి సంబరాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి మోడరన్ పూర్వ విద్యార్థి , బిగ్ బాస్ నైన్త్ సీజన్ విన్నర్ కళ్యాణ్ పడాల ఆత్మీయ అతిథిగా హాజరై సందడి చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన శ్రీకృష్ణ, గోదాదేవిల నాట్య ప్రదర్శన, భోగి పళ్ళు, భోగి మంటలు, హరిదాసు సందడి, కర్ర సాము తదితర కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. 


ఈ సందర్భంగా మోడరన్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ లయన్ జి. వి. రావు మాట్లాడుతూ... 952 మంది విద్యార్థులతో పాటు జూనియర్ కాలేజీ స్టాఫ్ కూడా సాంప్రదాయ వస్త్రధారణలో సంక్రాంతి సంబరాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. బిగ్ బాస్ విన్నర్  కళ్యాణ్ పడాల తమ హాస్టల్ నందు 5నుండి పదో తరగతి వరకు చదువుకున్నారని, అగ్నిపరీక్షకు వెళ్లే ముందు కూడా  తమ సంస్థకు వచ్చిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు. భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశమని, అనేక పండుగల సమాహారమని జి. వి. రావు అభివర్ణించారు. 

అనంతరం బిగ్ బాస్ విన్నర్ కళ్యాణ్ పడాల మాట్లాడుతూ... తన చిన్ననాటి బాల్యమంతా మోడ్రన్ విద్యాసంస్థల్లో హాస్టల్ లోనే గడిచిందన్నారు. తనకు ఉచితంగా విద్యను అందజేయడంతోపాటు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా హాస్టల్ వసతి కూడా మోడరన్ నందు లభించిందన్నారు. ఈ విజయంలో  మోడరన్ విద్యాసంస్థలు క్రియాశీలక భూమిక పోషించాయని ధన్యవాదాలు తెలియజేశారు. 

కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న కూటమి సీనియర్ నేత వాసంశెట్టి సత్యం మాట్లాడుతూ... సాంప్రదాయ బద్ధంగా కోలాహాలంగా  ఒక వేడుకలా సంక్రాంతి సంబరాలు నిర్వహించిన ఘనత మోడ్రన్ అధినేత జి. వి.రావుకి దక్కుతుందని అభినందించారు. 

ఇంటర్మీడియట్ ప్రిన్సిపల్ సిహెచ్ రాజేష్ మాట్లాడుతూ... విద్యార్థులకు సంస్కృతి సాంప్రదాయాలను పరిచయం చేసే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించినట్లు పేర్కొన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలను డిజైన్ చేసిన లేడీ ఫ్యాకల్టీ ని ప్రిన్సిపాల్ ప్రత్యేకంగా అభినందించారు. 

కార్యక్రమంలో కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ సతీమణి సునీత, మోడరన్ విద్యాసంస్థల ట్రెజరర్ గోలిమంగాదేవి, డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్  పి.వెంకటేశ్వర్లు, మోడరన్ ప్రైమరీ అకాడమిక్ డైరెక్టర్లు కె. సాయిరాం చౌదరి, ఎ.రమాదేవి, వైస్ ప్రిన్సిపాల్ పి.ఎస్.ప్రకాష్, అకాడమిక్ అడ్వైజర్ సి. హెచ్. శ్రీనివాస్, మోడరన్ జూనియర్ స్టాఫ్, స్టూడెంట్స్, విద్యార్థుల తల్లిదండ్రులు, భారీ సంఖ్యలో పురప్రజలు పాల్గొన్నారు.