కోకో బోర్డు, కోకో పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేయాలి


కోకో గింజలకు ధరల పాలసీ ప్రకటించాలి.
-ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం వినతి


ఏలూరు జనవరి 30: కోకో బోర్డు, కోకో పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేయాలని, కోకో గింజలకు ధరల పాలసీ ప్రకటించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి  కింజరాపు అచ్చెన్నాయుడు కు వినతి పత్రం అందజేశారు.

శుక్రవారం ఏలూరులోని చింతలపూడి రోడ్ లో బాలాజీ గార్డెన్ ఫంక్షన్ హాలులో జరిగిన రాష్ట్ర స్థాయి కోకో కాంక్లేవ్ సదస్సు లో వ్యవసాయ శాఖా మంత్రికి, రాష్ట్ర ఉద్యాన డైరెక్టర్ కె. శ్రీనివాసులు కు వినతి పత్రాలు అందజేసి కోకో రైతుల సమస్యలను వివరించారు.

ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలోని కోకో రైతులు కోకో సాగులో అనేక కష్టనష్టాలను ఎదుర్కొంటున్నారని చెప్పారు. మన దేశ అవసరాలకు తగినంతగా కోకో గింజల ఉత్పత్తి లేదని, విదేశీ దిగుమతులపై ఆధారపడుతున్నామని వివరించారు. ఈ ఏడాది నుండి ధర పాలసీ ప్రకటించి ఫార్ములా రూపొందించి ధర నిర్ణయిస్తామని ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరారు. 

ఆయిల్ పామ్ గెలలకు ధర నిర్ణయిస్తున్న విధంగా ప్రైస్ ఫార్ములా ప్రకటించి  ధర నిర్ణయించాలని కోరారు. అన్ని కంపెనీలు విదేశాల నుండి తక్కువ దిగుమతి సుంకంతో కోకో గింజలను, దిగుమతి సుంకం లేకుండా  కోకో బట్టర్, కోకో పౌడర్, కోకో ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటున్నాయన్నారు. దీని వలన దేశీయంగా రైతులు నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. 

కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకాలను పెంచి ఇక్కడ కోకో గింజలకు ధర పెరిగేలా చర్యలు చేపట్టలన్నారు.రాష్ట్రంలో కోకో విస్తీర్ణం రోజు రోజుకి పెరుగుతున్నదని,ఈ నేపథ్యంలో కోకో పరిశోధన కేంద్రాన్ని, కోకో బోర్డును ఏర్పాటు చేయాలని కోరారు.కంపెనీలు సిండికేట్ గా మారి రైతులను నష్టపరిచే చర్యలను ఆపాలన్నారు.

ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు బి.రామకృష్ణ,రాష్ట్ర నాయకులు పి.ఎస్.రావు, బి. సుబ్బారావు, జి. వీరారెడ్డి, యు.కాశీ, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కట్టా భాస్కరరావు పలువురు కోకో రైతులు పాల్గొన్నారు.