ఏలూరు, జనవరి 30: రాష్ట్రాన్ని హార్టికల్చర్, కోకో హబ్‌గా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ఏలూరు నగరంలోని చింతలపూడి రోడ్డులో ఉన్న బాలాజీ గార్డెన్స్ ఫంక్షన్ హాలులో శుక్రవారం నిర్వహించిన రాష్ట్ర స్థాయి కోకో కాంక్లేవ్ సదస్సును మంత్రి జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, కోకో ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందని తెలిపారు. కోకో పంటను మరింత విస్తీర్ణంలో విస్తరించేందుకు రైతులను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ కాంక్లేవ్ నిర్వహించామని చెప్పారు. తక్కువ ఖర్చుతో నాణ్యమైన కోకో ఉత్పత్తి, సాగులో తీసుకోవాల్సిన మెళకువలు, మార్కెటింగ్ సౌకర్యాలపై అధికారులు, ఉద్యానవన శాస్త్రవేత్తలు రైతులకు అవగాహన కల్పిస్తారని వివరించారు.
రైతుల సమస్యలను ముందుగానే గుర్తించి పరిష్కార దిశగా తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. రాష్ట్ర జీఎస్‌డీపీలో వ్యవసాయం వాటా రూ.50 వేల కోట్లు కాగా, ఉద్యానవన శాఖ వాటా రూ.1.68 లక్షల కోట్లు ఉందని తెలిపారు. రైతులకు అధిక ఆదాయం అందించేలా ఉద్యానవన పంటలకు ప్రోత్సాహం ఇస్తూ డ్రిప్, స్ప్రింక్లర్లు, ఆటోమేషన్ వంటి సాంకేతికతలను అందిస్తున్నామని చెప్పారు.
విజయవాడలో అంతర్జాతీయ స్థాయిలో హార్టికల్చర్ కాంక్లేవ్‌ను త్వరలో నిర్వహించి ఉద్యానవన పంటల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీని ఏర్పాటు చేసి, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపనకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. మార్కెట్ ఇంటర్వెన్షన్ పథకంపై మాట్లాడుతూ, గత ప్రభుత్వం రూ.7,500 కోట్లు కేటాయించినప్పటికీ ఐదేళ్లలో కేవలం రూ.1,300 కోట్లు మాత్రమే రైతులకు అందించిందని విమర్శించారు. తమ ప్రభుత్వం గత బడ్జెట్‌లో రూ.300 కోట్లు కేటాయించి, ఒక్క సంవత్సరంలోనే రూ.1,200 కోట్లను రైతులకు అందించామని తెలిపారు.
పంట కోత అనంతరం కోకో గింజల నాణ్యత తగ్గకుండా తీసుకోవాల్సిన చర్యలపై రైతులకు అవగాహన కల్పిస్తున్నామని, దీనివల్ల కోకోకు మంచి ధర లభిస్తుందని మంత్రి పేర్కొన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ ప్రిన్సిపల్ కార్యదర్శి శ్రీ చిరంజీవి చౌదరి మాట్లాడుతూ, తక్కువ ఖర్చుతో నాణ్యమైన కోకో సాగు, అధిక దిగుబడి, రైతుకు లాభసాటిగా ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. కోకో కాంక్లేవ్‌లో నాణ్యమైన ఉత్పత్తి, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు, బ్యాంకుల సహకారం వంటి అంశాలపై రైతులకు అవగాహన కల్పిస్తారని తెలిపారు.
జిల్లా కలెక్టర్ శ్రీమతి కె. వెట్రిసెల్వి మాట్లాడుతూ, ఏలూరు జిల్లాలో 44,984 ఎకరాల్లో కోకో సాగు జరుగుతూ, 10 వేల మెట్రిక్ టన్నుల ఉత్పత్తితో దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందని తెలిపారు. స్వర్ణాంధ్ర సాధనలో ఉద్యానవన పంటల పాత్ర కీలకమని పేర్కొన్నారు. జిల్లాలో అదనంగా 1,200 హెక్టార్లలో కోకో సాగుకు 15 వేల మంది రైతులకు శిక్షణ అందించామని తెలిపారు. కోకో అభ్యుదయ రైతులను కేరళ, కర్ణాటక రాష్ట్రాలకు అధ్యయన పర్యటనకు పంపినట్లు చెప్పారు. 100 ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల లక్ష్యంలో భాగంగా 7 చాకొలేట్ పరిశ్రమలను డ్వాక్రా సంఘాల ద్వారా ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు.
ఏలూరు ఎమ్మెల్యే శ్రీ బడేటి రాధాకృష్ణయ్య (చంటి) మాట్లాడుతూ, రాష్ట్ర స్థాయి కోకో కాంక్లేవ్‌లో శాస్త్రవేత్తలు ఇచ్చే సూచనలు రైతులకు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. గత ఏడాది కోకో ధరలు పడిపోయినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కిలోకు రూ.50 మద్దతు ధర అందించిందని గుర్తు చేశారు.
దెందులూరు ఎమ్మెల్యే శ్రీ చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ, శాస్త్రవేత్తల సూచనలతో రైతులు తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి సాధించాలని కోరారు.
చింతలపూడి ఎమ్మెల్యే శ్రీ సొంగా రోషన్ కుమార్ మాట్లాడుతూ, కోకో ఉత్పత్తిలో చింతలపూడి నియోజకవర్గం దేశంలోనే ముందంజలో ఉందన్నారు. విదేశీ కోకో మొక్కల వినియోగంతో నాణ్యత పెంచి అంతర్జాతీయ మార్కెట్‌తో పోటీ పడవచ్చన్నారు.
ఉంగుటూరు ఎమ్మెల్యే శ్రీ పత్సమట్ల ధర్మరాజు మాట్లాడుతూ, కోకో ప్రాసెసింగ్ యూనిట్లు, చాకొలేట్ పరిశ్రమలు జిల్లాలో ఏర్పాటు చేయాలని కోరారు. నాణ్యమైన కోకో ఉత్పత్తితో కిలోకు రూ.150కు పైగా అదనపు ఆదాయం సాధించవచ్చన్నారు.
ఈ కార్యక్రమంలో ఉద్యానవన శాఖ కమిషనర్ కె. శ్రీనివాసులు, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి సాజా నాయక్, జిల్లా వ్యవసాయ అధికారి హబీబ్ భాషా, ఇడా చైర్మన్ పెద్దిబోయిన శివప్రసాద్, మార్కెట్ కమిటీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారధి, ఆర్డీఓ అచ్యుత్ అంబరీష్, మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళి రామకృష్ణ, జాతీయ పరిశోధనా సంస్థల ప్రతినిధులు, బ్యాంకర్లు, కోకో ప్రాసెసింగ్ పెట్టుబడిదారులు, కోకో రైతులు పాల్గొన్నారు.
అనంతరం కోకో పంటలో అధిక దిగుబడి, తెగుళ్ల నివారణకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేయడంతో పాటు, వివిధ కంపెనీలు, బ్యాంకులు ఏర్పాటు చేసిన స్టాళ్లను మంత్రి అచ్చెన్నాయుడు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులను దుశ్శాలువాలతో సత్కరించారు.




















Social Plugin