మా భూములు ఇవ్వలేం.. మా జీవితాలు నాశనం చేయవద్దు అంటూ కొయ్యలగూడెంలో కదంతొక్కిన రైతులు,మహిళలు..


నేవీ ఆయుధ డిపో పేరుతో బలవంతపు భూసేకరణ చేయవద్దు..

కొయ్యలగూడెం మండల తహసీల్దార్ కార్యాలయం ముట్టడి.. రైతుల మహాధర్నా..
నేవీ ఆయుధ డిపో నిర్మాణానికి  రైతుల భారీ నిరసన ప్రదర్శన..
నేవీ ఆయుధ డిపో నిర్మాణ ప్రతిపాదన వెనక్కి తీసుకోవాలని డిమాండ్..
నా ప్రాణాలైనా ఇస్తాం.. మా భూములు ఇవ్వం.. ప్రభుత్వ నిర్ణయం ఉపసంహరించుకోకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తాం..
రైతులు, మహిళలు,రైతు సంఘాల నాయకులు హెచ్చరిక..
బలవంతపు భూసేకరణ చేయమని మండల తహసీల్దార్ హామీతో ఆందోళన విరమణ..


కొయ్యలగూడెం జనవరి 29: మా భూములు ఇవ్వలేం.. మా జీవితాలు నాశనం చేయవద్దు.. నేవీ ఆయుధ డిపో పేరుతో బలవంతపు భూసేకరణ ఆపాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో కొయ్యలగూడెం మండలం బోడిగూడెం, మంగపతి దేవి పేట, బర్కెట్ నగర్, రేగులగుంట,ఊట్లగూడెం, త్రినాధపురం గ్రామాల రైతులు, రైతు కూలీలు, మహిళలు, ప్రజలు కొయ్యలగూడెంలో కదం తొక్కారు. 

మండల తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. మా ప్రాణాలైనా ఇస్తాం గానీ మా భూములు ఇవ్వలేమని అంటూ మహా ధర్నా నిర్వహించారు.తహసీల్దార్ కార్యాలయం నుండి మెయిన్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి తాడేపల్లిగూడెం రోడ్డు వద్ద  కొద్దిసేపు రాస్తారోకో నిర్వహించారు. నిరసనకారులు నినాదాలతో హోరెత్తించారు.

కొయ్యలగూడెం మండలంలో నేవీ ఆయుధ డిపో నిర్మాణానికి వ్యతిరేకంగా గురువారం రైతులు భారీ నిరసన కార్యక్రమంలో పోలవరం, గోపాలపురం నియోజకవర్గాలకు చెందిన రైతులు, రైతు కూలీలు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. బోడిగూడెం గ్రామం నుంచి కొయ్యలగూడెం వరకు సుమారు ఆరు కిలోమీటర్ల ర్యాలీ నిర్వహించారు. నేవీ ఆయుధ డిపో ఏర్పాటును తక్షణమే నిలిపివేయాలంటూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.


ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె. శ్రీనివాస్ మాట్లాడుతూ, గ్రామసభ తీర్మానం లేకుండా, ప్రజల అభిప్రాయం తెలుసుకోకుండా ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. రైతులను జైళ్ళు లో నిర్భందించైనా  భూములు తీసుకుంటాం.. ఆయుధ డిపోని ఆపబోము” అంటూ ఏలూరు ఎంపీ చేసిన  వ్యాఖ్యలపై రైతాంగం తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని చెప్పారు. వేల కోట్ల రూపాయల కాంట్రాక్టు పనులు కోసం రైతుల భూములను లాక్కోవద్దని, వారి జీవితాలను బలిపెట్టవద్దని చెప్పారు. 

రైతులను విభజించి, వారు భూములను బలవంతంగా లాక్కుని  ఆయుధ కర్మాగారం ఏర్పాటు చేయాలనే ప్రయత్నాలు ఆపకపోతే ప్రజలు,రైతులు పెద్ద ఎత్తున ఉద్యమం సాగిస్తారని హెచ్చరించారు.ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ఇప్పటికే మూడు చోట్ల తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్న ఆయుధ డిపోను కొయ్యలగూడెం మండలంలో ఏర్పాటు చేయడం పట్ల రైతాంగంలో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు.


పోలవరం ప్రాజెక్టు, చింతలపూడి ఎత్తిపోతల పథకం, గ్రీన్ ఫీల్డ్ హైవే, తాడిపూడి ఎత్తిపోతల పథకం, జాతీయ రహదారులు కోసం ఇప్పటికే భూములు ఇచ్చి అన్యాయానికి గురైన రైతులు, ఆయుధ కర్మాగారానికి భూములు ఇస్తే వీరి పరిస్థితి కూడా అదే విధంగా ఉంటుందని  ఆందోళన వ్యక్తం చేశారు. ఆయుధ డిపో నిర్మాణానికి 1200 ఎకరాల భూసేకరణ కోసం చేస్తున్న ప్రయత్నాలు తక్షణమే నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. 

అభివృద్ధికి మేము వ్యతిరేకం కాదని, ఇప్పటికే తమ భూముల అభివృద్ధి చేసుకుని, తమ గ్రామాలు అభివృద్ధి చేసుకుని జీవనోపాధి పొందుతున్న రైతుల పొట్టలు కొట్టి జీవితాలు నాశనం చేసి అభివృద్ధి చేస్తామని కల్లబొల్లి మాటలు చెప్పడం దుర్మార్గమన్నారు. ప్రభుత్వ భూములు ఉన్నచోట ఆయుధ డిపో నిర్మాణం చేయాలే తప్ప పచ్చని పంట భూములు నాశనం చేసి నిర్మాణం చేస్తామని చెప్పడం తగదన్నారు. వర్జీనియా పొగాకు, ఆయిల్ పామ్, మొక్క జొన్న,బనానా, కూరగాయలు, కోకో, కొబ్బరి, నిమ్మ తదితర ఉద్యాన, వాణిజ్య పంటలు పండే సారవంతమైన భూములను నాశనం చేయడం తగదన్నారు. 


2013 భూ సేకరణ చట్టానికి విరుద్ధంగా ప్రజా ప్రతినిధులు, అధికారులు వ్యవహరించడం అన్యాయమన్నారు. ఇక్కడ పండే పంట భూముల ద్వారా సంవత్సరం అంతా కూలీలకు ఉపాధి దొరుకుతుందని చెప్పారు. ఇప్పుడిప్పుడే పంట భూములు పూర్తిస్థాయిలో సాగులోకి వచ్చాయని, రైతులు ఫలసాయం పొందే సమయంలో వారి పొట్టలు కొట్టడం తగదన్నారు. ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే రైతులు, ప్రజలు పోరాటం మరింత ఉధృతం చేస్తారని హెచ్చరించారు. 

సిపిఐ జిల్లా కార్యదర్శి ఎం.కృష్ణ చైతన్య సంఘీభావం ప్రకటిస్తూ మాట్లాడారు. జీలుగుమిల్లి మండలం వంకవారిగూడెంలో ఆయుధ డిపో నిర్మాణ భూసేకరణ పై పెద్ద ఎత్తున గిరిజనులు రైతులు ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమం సాగించాలని గుర్తు చేశారు. ప్రజల పోరాటానికి అండగా ఉంటామని చెప్పారు.  

బాధిత రైతులు చలసాని కిషోర్, ఆతుకూరి వీర్రాజు, మంగపతి దేవి పేట సర్పంచ్ సుబ్రహ్మణ్యం, సుగ్గన బోయిన ఏడుకొండలు, జక్కుల పెద వెంకన్న, ఆవూరి గంగరాజు  కానూరి శ్రీను, మెంతి సీతారాములు, రేగులగుంట సర్పంచ్  ఇళ్ళ శ్రీరామమూర్తి, గున్నూరి డాక్టరమ్మ, నిమ్మగడ్డ సత్యనారాయణ మాట్లాడుతూ 90 శాతం మంది రైతులు భూసేకరణ అంగీకరించారని ఏలూరు ఎంపీ ప్రచారం చేస్తున్నారని, మేము ఎక్కడ అంగీకరించామో చెప్పాలని డిమాండ్ చేశారు. 

గ్రామసభ నిర్వహించకుండా మా ఆమోదం లేకుండా ఎంపీ ఏ విధంగా చెబుతారని ప్రశ్నించారు. ఇలాంటి తప్పుడు ప్రచారం మానుకోవాలని కోరారు. మా భూములు ఇచ్చేదన్నారు. 100% మంది రైతులం వ్యతిరేకిస్తున్నామని చెప్పారు.

ప్రాణాలు పోయినా ఆయుధ కర్మాగారానికి భూములు ఇవ్వం” అంటూ మహిళా రైతులు భీష్మించగా, తహసిల్దార్ కార్యాలయాన్ని రైతులు ముట్టడి చేసి దిగ్బంధించారు. సర్వే పేరుతో మళ్లీ భూముల్లోకి వస్తే ఆత్మార్పణ చేసుకుంటామని ప్రభుత్వానికి రైతాంగం అల్టిమేటం ఇచ్చింది. అనంతరం మండల తహసీల్దార్ కు  వినతి పత్రం అందజేశారు. తహసీల్దార్ మాట్లాడుతూ బలవంతంగా భూసేకరణ చేయమని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

ఈ రైతాంగ ఉద్యమానికి సిపిఎం మండల కార్యదర్శి శుక్ల బోయిన రాంబాబు, సిపిఐ మండల కార్యదర్శి ఆంజనేయరాజు, ఏఐకేఎంఎస్ నాయకులు మడకం రామన్న సంఘీభావం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో రైతులు, రైతు కూలీలు, మహిళలు పాల్గొన్నారు.