గ్రామీణ అభివృద్ధి కూటమి ప్రభుత్వ లక్ష్యం
రూ.83. 15 లక్షలతో రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన కూటమి పార్టీ సీనియర్ నాయకులు
డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, కాజులూరు: ప్రజల మౌలిక అవసరాలే కూటమి ప్రభుత్వానికి తొలి ప్రాధాన్యమని, పల్లెలు బాగుంటేనే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని కూటమి పార్టీ సీనియర్ నాయకులు వాసంశెట్టి సత్యం పేర్కొన్నారు. కాకినాడ జిల్లా రామచంద్రపురం నియోజవర్గం కాజులూరు మండల పరిధిలో రూ.83 లక్షల వ్యయంతో చేపట్టనున్న రోడ్ల నిర్మాణ పనులకు శనివారం మండల పరిషత్ అభివృద్ధి అధికారి జె రాంబాబు, ఎ ఏం సి చైర్మన్ అక్కల రిశ్వంత్ రాయ్, మండల టిడిపి అధ్యక్షులు చవ్వాకుల నారాయణమూర్తి, కూటమి నాయకుల సమక్షంలో శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా వాసంశెట్టి సత్యం మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి మంచి రహదారులే బలమైన పునాది అని అన్నారు. రోడ్లు మెరుగుపడితే వ్యవసాయం, విద్య, వైద్యం, వ్యాపారం వంటి రంగాలు వేగంగా అభివృద్ధి చెందుతాయని తెలిపారు. ప్రజలు సుఖసంతోషాలతో జీవించేలా అవసరమైన మౌలిక వసతులు కల్పించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. మండలంలోని మంజూరు గ్రామం నుంచి మొగలి పాలెం చెరువుల వరకు రోడ్డు నిర్మాణానికి రూ. 50 లక్షలు, కాజులూరు లోని 9 సీసీ రోడ్డు పనులకు సంబంధించి రూ. 33. 15 లక్షలు మొత్తంగా రూ. 83.15 లక్షలతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామన్నారు. మంత్రి సుభాష్ కృషి,ఆదేశాల మేరకు తామంతా పనిచేస్తున్నామన్నారు.
ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని స్పష్టం చేశారు. చేపట్టిన రోడ్ల నిర్మాణ పనులు నాణ్యత ప్రమాణాలతో, నిర్ణీత కాలంలో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవోలు చక్రపాణి, సత్యనారాయణమూర్తి, ఏఈ సిహెచ్ భవాని శంకర్, ఏఎంసి వైస్ చైర్మన్ దడాల నాగార్జున, అన్యం శ్రీరామ్, యాళ్ల కృష్ణారావు, జడ్పిటిసి వనం సుబ్బారావు, సర్పంచ్ గుంటూరు అప్పారావు, ఎంపీటీసీ మణికంఠ, గ్రామ కమిటీ అధ్యక్షులు గోవిందరాజులు, డి సీలు కృష్ణ చైతన్య, తాడి మాచారెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ గండి ధనరాజ్, పంచాయతీ సెక్రెటరీ శ్రీనివాస్ అధికారులు, కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.















Social Plugin