- బాధితులకు నెఫ్రాలజిస్టు సేవలను అందుబాటులోకి తీసుకొచ్చాం
- వ్యాధి బాధితులకు మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నాం..
- 624 మందికి మెరుగైన పౌష్టికాహారపు కిట్లను అందిస్తున్నాం..
- జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ, ఎంపీ కేశినేని శివనాథ్
ఎన్‌టీఆర్ జిల్లా,ఎ.కొండూరు: జిల్లాలోని తిరువూరు నియోజకవర్గంలోని తిరువూరు, ఎ.కొండూరు, గంపలగూడెం పరిసర ప్రాంతాల్లో కిడ్నీ వ్యాధిని శాశ్వతంగా నివారించాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని, జనవరి మాసాంతం నాటికి కృష్ణా జలాలను అందుబాటులోకి తీసుకురానున్నామని, వ్యాధిగ్రస్తులను గుర్తించి నెఫ్రాలజిస్టు సేవల ద్వారా మెరుగైన వైద్య సేవలందించడంతో పాటు పౌష్టికాహారపు కిట్లను పంపిణి చేస్తున్నామని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ, పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని) తెలిపారు.
జిల్లాలో తిరువూరు నియోజకవర్గం పరిధిలోని ఎ.కొండూరు పరిసర ప్రాంతాల్లో కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న రోగులకు కేశినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో పౌష్టిహారం కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని ఎ.కొండూరు మండలం, జిల్లా పరిషత్ పాఠశాలలో కలెక్టర్ డా. జి.లక్ష్మీశ, పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ ప్రారంభించి పౌష్టికాహార కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తిరువూరు నియోజకవర్గంలోని ఎ.కొండూరు పరిసర ప్రాంతాల్లో కిడ్నీ వ్యాధి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు.
ఇందులో భాగంగా కృష్ణా జలాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చి స్వచ్ఛమైన తాగునీటిని అందించేందుకు చేపట్టిన ప్రాజెక్టు పనులు పూర్తయ్యాయని.. జనవరి మాసాంతానికి కృష్ణా జలాలను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. కృష్ణా జలాల సరఫరాకు సంబంధించి కొండపల్లి రైల్వేగేటు వద్ద ఏర్పడిన లీకేజ్ సమస్య, ఇతర ప్రాంతాల్లో మరమ్మత్తుల పనులకు రూ. 350 కోట్లు అదనపు నిధులతో పనులు శరవేగంతో జరుగుతున్నాయని.. పనులను పూర్తిచేసి జనవరి చివరినాటికి ప్రతిఇంటికీ కృష్ణా జలాలను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.
నెఫ్రాలజిస్టు సేవలను మరింత విస్తృతం చేశామని.. మెరుగైన వైద్య సహాయంతో పాటు అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. వ్యాధి లక్షణాలతో ఉన్నవారిని గుర్తించి వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేశామన్నారు. ప్రభుత్వం తీసుకున్న చర్యలకు ప్రజల సహకారం ఎంతో అవసరమన్నారు. ముఖ్యంగా గిరిజనుల్లో వారి ఆహారపు అలవాట్లలో మార్పులు, క్రమశిక్షణాయుత జీవనశైలిని అలవరుచుకోవాలని కోరారు.
కేశినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో 11 రకాలతో కూడిన పౌష్టికాహార కిట్లను ప్రతినెలా వ్యాధిగ్రస్తులకు అందించి, తద్వారా వ్యాధి తీవ్రతను తగ్గించేందుకు ముందుకు రావడం అభినందనీయమని తెలిపారు. ఎ.కొండూరు పరిసర ప్రాంతంలో ప్రస్తుతం 23 మంది కిడ్నీ వ్యాధిగ్రస్తులకు డయాలసిస్ సేవలు అందిస్తున్నామని సీరం క్రియాటిన్ 2 శాతంతో 175 మంది, 1.5 శాతంతో 81 మంది చికిత్స పొందుతున్నారని, వ్యాధిగ్రస్తులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చినట్లు జిల్లా కలెక్టర్ లక్ష్మీశ వివరించారు.
ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) మాట్లాడుతూ ఎంతోకాలంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న ఎ.కొండూరు పరిసర ప్రాంత ప్రజలకు త్వరలో పరిష్కార మార్గం లభించనుందన్నారు. ఇందుకోసం కృష్ణాజలాల పంపిణీకి సంబంధించిన పనులు పూర్తయ్యాయని.. ఈ మాసాంతానికి స్వచ్ఛమైన తాగునీటిని అందించేందుకు అధికారులు కృషిచేస్తున్నారన్నారు. చిరకాల సమస్య అయిన గంపలగూడెం మండలం, కట్టలేరుపై వంతెన నిర్మాణం పనులను ఈ ఏడాది ఏప్రిల్ నెలలో ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామని... ఇందుకు సంబంధించిన డీపీఆర్‌లు పూర్తయ్యాయన్నారు.
సాగర జలాలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు గతంలో తమ ప్రభుత్వం చింతలపూడి పిట్టవానిపాలెం ఎత్తిపోతల పథకాలను శ్రీకారంచుట్టడం జరిగిందని.. గత ప్రభుత్వం వాటిని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందన్నారు. తిరిగి మళ్లీ పనులు పూర్తిచేసి సాగర జలాలను అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. తిరువూరులో నవోదయ పాఠశాలనుత్వరలో ప్రారంభించేందుకు కృషిచేస్తామన్నారు. ఇబ్రహీంపట్నం నుంచి తిరువూరు వరకు జాతీయ రహదారిపై సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు.
తిరువూరు మున్సిపాలిటీ పరిధిలో తాగునీటి సరఫరా వ్యవస్థను మెరుగుపరిచేందుకు రూ. 140 కోట్లు మంజూరయ్యాయని.. త్వరలో పనులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. తిరువూరు నియోజకవర్గం పరిధిలో రోడ్ల అభివృద్ధికి రూ. 32 కోట్లు ప్రభుత్వం మంజూరు చేయడం జరిగిందని, పనులు పూర్తిచేయడం ద్వారా రోడ్లను అభివృద్ది చేయనున్నట్లు కేశినేని శివనాథ్ తెలిపారు.
కేశినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో కిడ్నీ వ్యాధిగ్రస్తులకు 11 రకాల పౌష్టికాహారంతో కూడిన కిట్లను తయారుచేసి ప్రతినెలా సుమారు 650 మందికి పంపిణీ చేయనున్నామన్నారు. ఇందుకోసం ప్రతి గ్రామంలోనూ ముగ్గురు సభ్యులతో కమిటీని ఏర్పాటుచేసి ప్రతినెలా ప్రభుత్వం ఎలా అయితే పింఛను పంపిణీ చేస్తుందో అదే విధంగా ప్రతి వ్యాధిగ్రస్తుని ఇంటికి వెళ్లి పౌష్టికాహార కిట్లను పంచి, వారి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో భాగస్వామ్యం కల్పిచనున్నామన్నారు.
కార్యక్రమంలో తిరువూరు ఆర్‌డీవో కె.మాధురి, డీఎంహెచ్‌వో డా. ఎం.సుహాసిని, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్ఈ తిరుమల కుమార్, స్థానిక తహసీల్దార్ అరవింద్, ఎంపీడీవో డి.శ్రీనివాసరావు, స్థానిక నాయకులు ఎ.రమేష్ రెడ్డి, బి.పీక్లా నాయక్, భీమా నాయక్, రాంప్రసాద్‌రెడ్డి, పి.శ్రీనివాస్‌రావు, చెరుకూరి రాజేశ్వరావు, ఆర్.వీరారెడ్డి, ఆర్.సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.















Social Plugin