ఏలూరు, జనవరి 26: దేశ రాజ్యాంగ విలువలను మరింత ఇనుమడింపచేసే విధంగా ప్రతి పౌరుడు నడుచుకున్నప్పుడే సుస్థిరత, సౌభ్రాతృత్వం సాధ్యమవుతాయని, అప్పుడు మాత్రమే అందరూ ఆశించే విధంగా అభివృద్ధి చెందిన ఉజ్వల భారత్ రూపుదిద్దుకుంటుందని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అన్నారు.
77వ భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏలూరులోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కూడా పాల్గొన్నారు. తొలుత టిడిపి జిల్లా అధ్యక్షులు బడేటి చంటి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థులకు మిఠాయిలు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ, ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌తో పాటు స్వాతంత్ర్య సమరయోధులు, రాజ్యాంగ రూపకర్తల ఆశయాలను సాకారం చేయడానికి ప్రజలంతా సమిష్టిగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగాన్ని రూపొందించి అమల్లోకి తెచ్చి, స్వాతంత్ర్య ఫలాలను ప్రతి పౌరునికి అందించిన మహనీయుల త్యాగాలను స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో ఈడా చైర్మన్ పెద్దిబోయిన శివప్రసాద్, బీఎస్‌ఎన్‌ఎల్ అడ్వైజరీ బోర్డు కమిటీ సభ్యులు లంకపల్లి మాణిక్యాలరావు, శనివారం పేట సొసైటీ బ్యాంక్ చైర్మన్ కోనేరు వంశీ, టిడిపి నగర ప్రధాన కార్యదర్శి రెడ్డి నాగరాజు సహా వివిధ హోదాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.















Social Plugin