ఏలూరు, జనవరి 26: మనువాద శక్తుల దాడుల నుంచి భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే ప్రజలు పోరాటాలకు సిద్ధమవ్వాలని భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) నేతలు పిలుపునిచ్చారు. 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సిపిఐ ఏలూరు ఏరియా సమితి ఆధ్వర్యంలో ఆర్ఆర్ పేట స్ఫూర్తిగా భవన్‌లో సోమవారం వేడుకలు నిర్వహించారు.
ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డేగా ప్రభాకర్ ఆవిష్కరించగా, జిల్లా కార్యదర్శి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రాజ్యాంగ పరిరక్షణకు కట్టుబడి ఉంటామని ప్రతిజ్ఞ చేశారు.
డేగా ప్రభాకర్ మాట్లాడుతూ భారత రాజ్యాంగం 77వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా దేశవ్యాప్తంగా గణతంత్ర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయని తెలిపారు. రాజ్యాంగ రచన కమిటీ చైర్మన్ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సుమారు 65 దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేసి, ప్రపంచంలోనే అతిపెద్ద చేతివ్రాత రాజ్యాంగాన్ని రూపొందించారని కొనియాడారు.
నేడు అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. గవర్నర్లను రాజకీయ పావులుగా ఉపయోగించి కేరళ, తమిళనాడు, బెంగాల్ వంటి బీజేపీ యేతర రాష్ట్రాల్లో శాసన ప్రక్రియను అడ్డుకుంటోందన్నారు. అలాగే ఎన్నికల కమిషన్ ద్వారా ఓట్ల తొలగింపునకు చర్యలు తీసుకుంటూ ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తోందని ఆరోపించారు.
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేయడం వల్ల గ్రామీణ ప్రజలు వలసలు వెళ్లే పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ‘ఆపరేషన్ కగార్’ పేరిట అమాయక గిరిజనుల హత్యలు జరుగుతున్నాయని, ఇది రాజ్యాంగం ప్రసాదించిన జీవించే హక్కుకు భంగం కలిగించడమేనని అన్నారు.
సిపిఐ జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య మాట్లాడుతూ, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం సమాఖ్య వ్యవస్థను దెబ్బతీస్తోందని విమర్శించారు. ప్రజలకు తిండి, ఇల్లు, విద్య, వైద్యం, ఉపాధి కల్పించకుండా కార్పొరేట్లకు ఊడిగం చేస్తోందని ఆరోపించారు. మతాలు, కులాల పేరుతో ప్రజలను విభజిస్తూ కార్మిక హక్కులను కాలరాస్తోందన్నారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ ఏరియా సమితి కార్యదర్శి ఉప్పులూరి హేమశంకర్, సహాయ కార్యదర్శులు కురెళ్ళ వరప్రసాద్, కార్యవర్గ సభ్యులు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.















Social Plugin